జన తెలంగాణ కావాలె!
నవ తెలంగాణ: తెలంగాణ వచ్చింది. సంతోషమే. కానీ వస్తుందనుకున్న తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. రాజకీయ తెలంగాణ మాత్రమే వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం. ప్రజల తెలంగాణ రావలసి ఉండే. దోపిడీ, పీడన లేని తెలంగాణ వస్తే బాగుండేది. రాజకీయ దోపిడీ, శ్రమ దోపిడీ లేని తెలంగాణ కావాలె. భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే.
ఒకప్పుడు దొర గడీలను కూలగొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిన ఉద్యమకారుడు ఆయన. మార్క్సిజాన్ని, మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను, తరతరాల సాహిత్య, సాంసృృతిక వారసత్వాన్ని వైవిధ్యభరితంగా ఆవిష్కరించిన గొప్ప రచయిత. దార్శనికుడు. ఆయనే అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య. తన జీవితకాలంలో వస్తుందో రాదో అనుకున్న తెలంగాణ వచ్చేసింది కానీ అది తాను కోరుకున్న తెలంగాణ కాదన్నది ఆయన ఆవేదన. సాక్షితో ఆ సాహితీ స్రష్ట పంచుకున్న భావాలు.. ఆయన మాటల్లోనే..!
- దాశరథి రంగాచార్య అంతరంగం
‘తెలంగాణ వచ్చింది కదా సంతోషమేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. ఏదో ఒకటి వచ్చినందుకు సంతోషమే కానీ, ఇది పెద్ద సంతోషమైతే కాదు. వచ్చింది రాజకీయ తెలంగాణ. దీనివల్ల ప్రజలకు ఏం పని.. ప్రజలకు మేలు చేసే తెలంగాణ రావలసి ఉండె. ప్రజల తెలంగాణ కోసం పోరాటం జరగవలసి ఉండే. అట్లా జరుగలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు సాధించిన ఫలితాలు ప్రజలకు దక్కినప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరినట్లు. కమ్యూనిస్టులు పంచిన లక్షలాది ఎకరాల భూములను దొరలు తిరిగి హస్తగతం చేసుకున్నారు. ఆ భూములు తిరిగి ప్రజల పరమైనప్పుడే తెలంగాణ లక్ష్యం నెరవేరినట్లు లెక్క. అదెట్లా సాధ్యమనుకోవద్దు. చిత్తశుద్ధి ఉండే ఏ మాత్రం కష్టం కాదు. ప్రజలకు భూమి మీద హక్కు లభించినప్పుడే వాళ్ల ఆత్మగౌరవం నిలబడుతుంది. గౌరవప్రదంగా బతుకుతారు. సాయుధ పోరాటం నుంచి నేటి దాకా ఎంతో రక్తాన్ని ధారపోసింది తెలంగాణ. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా బతికే సదుపాయాలు కావాలె. అట్లా బతుకాల్నంటే భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే.
సకల జనుల అభివృద్ధి జరగాలె..
ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేందుకు కాళోజీ లేడు. జయశంకర్ లేడు. తెలంగాణకు దిశానిర్దేశం చేసే పెద్దవాళ్లెవరు ఉన్నారు? చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. రాజకీయ నిరుద్యోగం కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న పార్టీలు కూడా ముందుకొస్తాయి. రాజకీయ అనిశ్చితి పెరుగుతుంది. కొట్లాటలు పెరుగుతాయి. తెలంగాణ అభివృద్ధికి ఇది అవరోధం. ఈ రాక్షస క్యాపిటలిస్టు ఉత్పత్తి విధానంలో సామాన్యుడు ఏమవుతాడోననేదే నా ఆవేదన. ఈ ధనపతులు మానవాళిని, మానవతను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. భవిష్యత్తు తరాలకు మట్టి చిప్ప కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం ఉండే విధంగా విధానాలు రూపొందించాలి. కార్మికుల జీవితాల్లో గొప్ప ముందడుగు రావాలి. అందుకు చక్కటి దార్శనికత అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనుల ఉద్యమ భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణలో సకల జనుల అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు పడాలి. అప్పుడే తెలంగాణ స్వయంపాలన సాధించుకున్నట్లు.
సాంస్కృతిక తెలంగాణ రావాలె..
నిజాం నిరంకుశ పాలనను,రజాకార్ల హింసను చవి చూసింది తెలంగాణ. ప్రజలు అనతి కాలంలోనే ఆ హింసను మరిచి నిజాంను ఒక ప్రభువుగా కీర్తిస్తారేమోననే భయం పట్టుకుంది నాకు. ఎందుకంటే అప్పటికే నిజాం కట్టించిన హైకోర్టును, ఉస్మానియా యూనివర్సిటీని పొగిడేవాళ్లు బయలుదేరారు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యే సులభ శైలిలో ‘చిల్లర దేవుళ్లు’ నవల రాశాను. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తెలంగాణ భాష, యాస, సంస్కృతి,సాహిత్యం అన్నీ అస్తిత్వాన్ని కోల్పోయినై. మన భాషా సాహిత్యాలను, సంస్కృతిని, కళలను పరిరక్షించే సాంస్కృతిక తెలంగాణ కోసం కృషి జరగాలే. మన యాసను కాపాడుకోవాలె. అందుకోసం పాలకుల దృష్టికోణం మా రాలె. సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలె.
రాయటం చేతనైతే బాగుండు..
తెలంగాణ జీవితాన్ని, సమాజాన్ని ఇతివృత్తంగా చేసుకొని రాశాను. ఇప్పటికీ రాయాలనిపిస్తుంది. నేను అనుకున్నవన్నీ రాసేవాన్ని. ఇప్పుడు నా వయస్సు 86. నేను వృద్ధున్నే అయినా మనస్సు మాత్రం యువకగానే ఉంది. శరీరమే సహకరించడం లేదు. నా ఉచ్ఛ్వాసం రచన.నిశ్వాసం పఠనం. అవి రెండూ లేకుండానే బతికేస్తున్నాను.
చౌరస్తా..
చైతన్యానికి మారుపేరు.. ఎగ్లాస్పూర్ ఓటర్లు
నేతల తలరాతలు మార్చే ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటూ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామస్తులు. విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన ఈ మారుమూల గ్రామంలో నక్సల్స్ ఆజ్ఞలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యంపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ జనాభా 619 కాగా, 380మంది ఓటర్లున్నారు. వీరిలో 40మంది విదేశాల్లో ఉన్నారు. 1994 ఎన్నికల్లో 72శాతం, 1996, 98లో 78శాతం, 2009 ఎన్నికల్లో 80శాతం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. - న్యూస్‌లైన్, కోనరావుపేట(కరీంనగర్)
అక్కడ టీడీపీకి 2 ఓట్లే: ఎ(వి)లక్షణం
మూడు దశాబ్దాలు గడిచిపోయినా అక్కడ టీడీపీకి పోలైన ఓట్లపై ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు స్వయంగా ప్రచారం చేసినా రెండంటే రెండే ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌విచార్‌మంచ్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి ఎన్నికైన గోనె ప్రకాశ్‌రావు తర్వాత రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా వేముల రమణయ్య బరిలోకి దిగారు. అప్పుడు ఆయన విజయం కోసం స్వయంగా ఎన్టీ రామారావు రంగంలోకి దిగి కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట, ఇద్లాపూర్ గ్రామాల్లో విస్తత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఆ గ్రామాల్లో టీడీపీకి రెండంటే రెండే ఓట్లు పోలయ్యాయి.
-న్యూస్‌లైన్, పెద్దపల్లి