ఈతలో ణిస్తున్న దీపక్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ... దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింది నుంచే మొదలవుతుంది.... అన్న తల్లి ప్రేరణ... ఎవరి జీవితమైనా సున్నాతోనే మొదలవుతుంది... మనల్ని మనం హీరోని చేసుకునే అవకాశం జీవితమే మనకు ఇస్తుంది... దానిని ఉపయోగించుకున్నవాడే విజేత అవుతాడు.. అంటూ తండ్రి ప్రోత్సహం లభించడంతో అతను వెనుదిరిగి చూడలేదు. అసాధ్యమనుకున్నదానిని సుసాధ్యం చేస్తూ చిన్న వయసులోనే జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ఈత కొలనులో దిగితే తనకు పోటీ ఎవరూ లేరని నిరూపించి పతకాలు కైవసం చేసుకుంటున్నాడు.
అనంతపురానికి చెందిన ఉమాదేవి, గణేష్‌బాబు దంపతుల కుమారుడు దీపక్... చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడలపైనా మక్కువ పెంచుకున్నాడు. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్నంటి ప్రోత్సహిస్తూ వచ్చారు. కరాటే, డ్యాన్స్, సంగీతం తదితర అంశాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. అదే సమయంలో ఈతపై దృష్టి మళ్లించాడు.
పోటీలో దిగితే పతకం గ్యారంటీ
2012లో అనంతపురంలోని భైరవ నగర్లో ఉన్న స్విమ్మర్ గంగాధర్ వద్ద ఈతలో ఓనమాలు దిద్దుకున్న దీపక్... 2014లో స్కూల్ గేమ్స్‌లో తన సత్తా ఏమిటో చాటిచెప్పాడు. అప్పటి నుంచి తన విజయపరంపరను కొనసాగిస్తూ వచ్చాడు. ప్రస్తుతం కర్నూలులోని ఇండస్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న దీపక్... జిల్లా, రాష్ట్ర, స్థాయి ఈత పోటీల్లో ఆ జిల్లా తరుఫున ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో పోటీల్లో అర్హత సాధించాడు. దీపక్‌కు ఈతలో ఉత్తం, రాజశేఖర్, రంగయ్య మెలకువలు నేర్పుతున్నారు. అనంతపురం జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యుడు రవిశేఖర్, వెంకటరెడ్డి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు.
సాధించిన పతకాలు
అండర్–14 అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో
200 మీ – ఇండ్యువిజల్ మిడ్లే - బంగారు పతకం
100 మీ – బ్రెస్ట్ స్ట్రోక్ - బంగారు పతకం
50 మీ – ఫ్రీ స్టయిల్ - బంగారు పతకం
2014లో జిల్లా స్థాయి ఓవరాల్ ఛాంపియన్
రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాలు
అనంతపురం వేదికగా 2015లో జరిగిన అండర్–17 స్కూల్‌గేమ్స్‌లో
50 మీ - బ్యాక్ స్ట్రోక్ - బంగారు పతకం
రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానం
2016లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిథ్యం
100 మీ - బ్యాక్ స్ట్రోక్ – బంగారు పతకం
100 మీ - బట్టర్ ఫ్లై – బంగారు పతకం
200 మీ - బ్యాక్ స్ట్రోక్ – బంగారు పతకం
రాష్ట్ర స్థాయి పోటీల్లో పై మూడు విభాగాల్లోనూ మూడో స్థానం
అండర్–17 జిల్లా స్కూల్ గేమ్స్‌లో కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిథ్యం
800 మీ - ఫ్రీ స్టయిల్ – కాంస్య పతకం
200 మీ - బ్యాక్ స్ట్రోక్ – బంగారు పతకం
400 మీ - ఇండ్యువిజల్ మిడ్లే – బంగారు పతకం
2016లో రాష్ట్రస్థాయి పోటీల్లో
200 మీ - బ్యాక్‌స్ట్రోక్ – రజతం
800 మీ - ఫ్రీ స్టయిల్ – రజతం
400 మీ - ఇండ్యువిజల్ మిడ్లే – కాంస్యం
రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది.