'అతడు లేని జీవితం నాకొద్దు'
రియో డీ జెనిరో: ఆమె అందరిలాగే అందమైన జీవితాన్ని కలగంది. ఏడేళ్లుగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. అంతా సవ్యంగా జరిగితే.. శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సింది. కానీ.. అంతలోనే జరిగిన పెను విషాదం ఆమెను ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొనేలా చేసింది. ఇటీవల విమానప్రమాదంలో మృతి చెందిన ఓ బ్రెజిల్ ఫుట్బాల్ క్రీడాకారుడి ప్రేయసి అమందా మచాడో జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదం ఇది.
కోపా సుడామెరికా ఫైనల్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న బ్రెజిల్ చాపెకోయన్స్ ఫుట్బాల్ టీం క్రీడాకారులు ఇటీవల కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో క్రీడాకారులతో సహా మొత్తం 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన 19 మంది క్రీడాకారుల్లో డెనర్ అసున్కావ్ బ్రాజ్ ఒకరు. డెనర్ మృతితో అమండా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.
’డెనర్ మరణ వార్త వినగానే నా గుండె ఆగిపోయింది.. అతడితో పాటే నేనూ వెళ్లిపోవాలని భావించా. అతడులేని జీవితం నా కొద్దు అనిపించింది’ అని ఆ విషాద ఘటనపై మాట్లాడుతూ అమండా తెలిపింది. డెనర్ విమానం ఎక్కడానికి ముందు తనకు ఓ మెసేజ్ చేశాడని.. కానీ దానిని తాను చూడకపోవడంతో చివరిసారిగా డెనర్కు గుడ్ బై చెప్పే అవకాశాన్ని కోల్పోయానని ఆమె వాపోయింది. తన సోల్మేట్, గొప్ప ఫుట్బాల్ క్రీడాకారుడు డెలన్ జీవితం మధ్యలోనే ఇలా ఆగిపోయిందని పెళ్లి కోసం వారు తయారుచేయించుకున్న ఉంగరాన్ని చూస్తూ ఆమె విషాదంలో మునిగింది.
డెలన్తో అనుబంధానికి గుర్తుగా అమండాకు రెండేళ్ల కొడుకు బెర్నార్డో ఉన్నాడు. బెర్నార్డో అచ్చం తండ్రి డెలన్లాగే ఉంటాడని.. అతడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతానని అంటోంది. మీ నాన్న ఒక అసాధారణమైన వ్యక్తి అని అతడికి చెబుతానంటూ.. కొడుకు భవిష్యత్తులోనే తన జీవితాన్ని వెతుక్కొంటోంది అమండా.