ఆలయాలకు అనుమతి ఇచ్చే అధికారం మున్సిపల్ కమిషనర్లకు!
ప్రభుత్వ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేసిన పురపాలక శాఖ
అధికారాలను జిల్లా కలెక్టర్ల వద్దే ఉంచాలంటూ సర్కారుకు విజ్ఞప్తి
హైదరాబాద్: ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనుమతులిచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి మున్సిపల్ కమిషనర్లకు బదలాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మాత్రం విముఖతతో ఉంది. మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగిస్తే సమస్యలొస్తాయని ప్రభుత్వానికి నివేదించింది. క్రైస్తవ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు చర్చిల నిర్మాణాలకు అనుమతులిచ్చే బాధ్యతలను మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులకు బదలాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఇటీవల సీఎం కార్యాలయం కోరింది. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సానుకూలంగా స్పందించి ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేసింది.
అయితే, పురపాలక శాఖ మాత్రం ఈ నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రార్థనా మందిరాలకు అనుమతులిచ్చే బాధ్యతలను మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తే పురపాలనకు సంబంధించిన ఇతర బాధ్యతలు కుంటుపడతాయని అభిప్రాయపడింది. ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ల చేతిలో మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయని, ప్రార్థనా స్థలాలకు అనుమతులిచ్చే బాధ్యతలు వారి వద్దే ఉంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం అమలులో వున్న మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రార్థనా మందిరాలకు అనుమతులిచ్చే అధికారం కేవలం జిల్లా కలెక్టర్లకే ఉంది. ఈ అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు అప్పగించాలంటే మున్సిపల్ చట్టాల సవరణ జరపక తప్పదని డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ, టౌన్ ప్లానింగ్ సైతం ప్రభుత్వానికి నివేదించింది.