దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు
నెల్లూరు(అర్బన్): దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు సూచించారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లను అందజేసే సదరమ్ క్యాంపును పెద్దాస్పత్రిలో మంగళవారం తనిఖీ చేశారు. రెండు వారాల నుంచి వారి సర్టిఫికెట్లపై డాక్టర్లు సంతకాలు చేయకపోవడాన్ని గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు మారడం లేదని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారంలోపు వారి సర్టిఫికెట్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. అనంతరం డాక్టర్ల హాజరుపట్టీలను పరిశీలించారు. అభివృద్ధి కమిటీలో కలెక్టర్ ఆదేశించిన మేరకు విధులకు రాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఒట్టూరు సంపత్రాజు, నాయకుడు గిరి, తదితరులు పాల్గొన్నారు.