‘మిషన్’లో అవినీతి
నాణ్యతాలోపంతో పనులు చేస్తున్నా..
పట్టించుకోని ఐబీ అధికారులు
కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్న లింగగిరి గ్రామస్తులు
లింగగిరి(చెన్నారావుపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని మిషన్ కాకతీయ పథకంతో చెరువుల అభివృద్ధికి లక్షల రూపాయలు విడుదల చేస్తే కాంట్రాక్టర్లు నాణ్యత లోపంతో పనులు చేపట్టి జేబులు నింపుకుంటున్నారని లింగగిరి గ్రామస్తులు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు కాయితపు శ్రీనివాస్, ఓరుగంటి నర్సింగరావు, మేడం కుమార్, మంద ఏకాంబ్రం, వెంకన్న, నరేష్లతో పాటు ఆ గ్రామానికి చెందిన రైతులు అక్కల్దేవి, బొల్లెబోయిన, చింతల్ చెరువులను వారు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బొల్లెబోయిన చెరువుకు నిధులు రూ.59.22 లక్షలు, చింతల్ చెరువుకు రూ.41.38 లక్షలు, అక్కల్దేవి చెరువుకు రూ.59.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఆ పనులను ఆయా కాంట్రాక్టర్లు మత్తడి, తూము, కాలువల పనులు సక్రమంగా చేయకుండానే నిధులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. కట్ట పనులు కూడా నామమత్రంగా పోసి చేతులు దులుపుకున్నారని అన్నారు. నిత్యం ఐబీ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనులు తూతూ మంత్రంగా జరిగాయని ఆరోపించారు. మూడు చెరువుల ఫొటోలతో కలెక్టర్కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.