devi prasad rao
-
మళ్లీ వివాదంలోకి హైదరాబాద్
దేవీప్రసాద్ రావు ఆరోపణ నాంపల్లి: హైదరాబాద్‌ను సీమాంధ్ర పాలకులు మళ్లీ వివాదంలోకి నెట్టారని టీఎన్జీఓ కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్‌రావు ఆరోపించారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఐదో వార్షికోత్సవాలు బుధవారం నాంపల్లిలోని గగన్ విహార్ భవన సముదాయంలో నిర్వహించారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా దేవీ ప్రసాద్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణపై ఆంధ్రా ప్రభుత్వం పడగ విప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రకు మూలం అక్కడి సీఎం చంద్రబాబేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ విభజన అంశంపై పూర్తిగా విజయం సాధించలేకపోయామని చెప్పారు. దీనికి ఆంధ్రా అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యమ రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జోన్ల వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి హమీద్, ఉపాధ్యక్షురాలు రేఛల్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వివేక్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గె జిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.శ్యామ్, టీఎన్జీఓ కార్యనిర్వాహక కార్యదర్శి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మండలిపోరు.. ప్రచార హోరు
హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జిల్లాలోని కీలక ప్రాంతాలన్నీ జల్లెడ పట్టి ఓటు వేయాలని అభ్యర్థించిన పోటీదారులు..ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు మలివిడత ప్రచారానికి తెరలేపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోఉన్న దేవీప్రసాద్ బుధవారం కుత్భుల్లాపూర్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఎన్.రామచంద్రరావు తన సొంత ప్రాంతమైన మల్కాజిగిరిలో పర్యటిస్తూ.. సమీప పట్టణ, గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో ముమ్మరంగా ప్రచారం చేశారు. మేడ్చల్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థి ఆగిరు రవికుమార్ గుప్తా గెలుపుకోసం.. ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారకార్యక్రమాల్లో బిజీగా గడిపారు. ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో నేరుగా ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకోవడంతోపాటు సామాజిక మాద్యమాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఫేస్బుక్, ట్విట్టర్లలోనే కాకుండా సర్వర్ ఫోన్ కాల్స్‌తో ఓటు వేయాలంటూ వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. -
‘ఉద్యమం’లో దేవీప్రసాద్ పాత్ర కీలకం
మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ బంగారు తెలంగాణ సాధన కో సం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో దేవీప్రసాద్‌రావు చురుకైన పాత్ర పోషించారన్నారు. ఉద్యోగులనందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలోనే ప్రధాన మలుపుగా భావిస్తున్న సకల జనుల సమ్మెను విజయవంతం చేయించిన ఘనత ఆయనదేనన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ కేవలం 25 శాతంగానే ఉందని, ఈసారి ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి దేవీప్రసాద్రావుకు ఓటు వేసేలా పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క రూ దోహదపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చె ప్పారు. ఈనెల 10న చేవెళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో జరగనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ అభియాన్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, రిటైర్ట్ ప్రధానోపాధ్యాయులు ఏ.మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు అంజయ్య తదితరులు మాట్లాడారు. దేవీప్రసాద్‌రావు ఎన్నికల ప్రచార పోస్టర్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు విడుదల చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌గుప్త, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ నాయకులు బర్కల రాంరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, ఆగిరెడ్డి, మగ్భూల్ షరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఉద్యోగుల కొనసాగింపును అంగీకరించం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ఉద్యోగుల కొనసాగింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం, జిల్లాల్లో అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో టీఎన్జీఓ యూని యన్ జిల్లా కోశాధికారి రాఘవేందర్రావు పదవీ విరమణ సన్మానసభ జరిగింది. సభకు హాజరైన ఆయన జిల్లా అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 15 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి తాము హైదరాబాద్ వారిమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగితే సహించేది లేదని, జూన్ 2 తర్వాతే ఉద్యోగుల విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఆ ప్రభుత్వాలపై పోరాటాలు చేసేందుకు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల స్థానిక ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర అధికారులు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు నర్సింలు, సుశీల్‌బాబు, జావేద్ పాల్గొన్నారు.