హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జిల్లాలోని కీలక ప్రాంతాలన్నీ జల్లెడ పట్టి ఓటు వేయాలని అభ్యర్థించిన పోటీదారులు..ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు మలివిడత ప్రచారానికి తెరలేపారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలోఉన్న దేవీప్రసాద్ బుధవారం కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఎన్.రామచంద్రరావు తన సొంత ప్రాంతమైన మల్కాజిగిరిలో పర్యటిస్తూ.. సమీప పట్టణ, గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో ముమ్మరంగా ప్రచారం చేశారు.
మేడ్చల్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థి ఆగిరు రవికుమార్ గుప్తా గెలుపుకోసం.. ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారకార్యక్రమాల్లో బిజీగా గడిపారు. ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో నేరుగా ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకోవడంతోపాటు సామాజిక మాద్యమాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలోనే కాకుండా సర్వర్ ఫోన్ కాల్స్‌తో ఓటు వేయాలంటూ వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు.