మళ్లీ వివాదంలోకి హైదరాబాద్ | Hyderabad controversy again | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదంలోకి హైదరాబాద్

Published Wed, Jun 10 2015 11:21 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Hyderabad controversy again

దేవీప్రసాద్ రావు ఆరోపణ
 
నాంపల్లి: హైదరాబాద్‌ను సీమాంధ్ర పాలకులు మళ్లీ వివాదంలోకి నెట్టారని టీఎన్జీఓ కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్‌రావు ఆరోపించారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఐదో వార్షికోత్సవాలు బుధవారం నాంపల్లిలోని గగన్ విహార్ భవన సముదాయంలో నిర్వహించారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా దేవీ ప్రసాద్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణపై ఆంధ్రా ప్రభుత్వం పడగ విప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రకు మూలం అక్కడి సీఎం చంద్రబాబేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ విభజన అంశంపై పూర్తిగా విజయం సాధించలేకపోయామని చెప్పారు.

దీనికి ఆంధ్రా అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యమ రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జోన్ల వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి హమీద్, ఉపాధ్యక్షురాలు రేఛల్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వివేక్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గె జిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.శ్యామ్,  టీఎన్జీఓ కార్యనిర్వాహక కార్యదర్శి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement