ఒగ్గుకళకు జీవంపోసింది మిద్దె రాములే..
అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు
వేములవాడ : ఒగ్గుకళకు జీవంపోసి... దానికి నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు మిద్దె రాములు అని రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. పట్టణంలోని రవీంద్ర ఫంక్షన్‌హాలులో బుధవారం జరిగిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షరజ్ఞానం లేకున్నా ఒగ్గుకథ ద్వారా ఆయన విన్యాసాలు, భాషాశైలి జనాల్ని కట్టిపడేసేవని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాలు, పలు దేశాల్లో ఆయన ప్రదర్శనలిచ్చారన్నారు. ఒగ్గుకథలో పూర్తిస్థాయిలో తెలంగాణ యాస, భాష ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణస్థాయిలో కళాకారులను ప్రోత్సహిస్తూ తన కళా నైపుణ్యంతో ఎంతో మంది శిష్యులకు ఉపాధిబాట చూపించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సైతం తెలుగుభాష, ఒగ్గుకథకు ప్రత్యేక ప్రాధాన్యతినిస్తున్నారన్నారు. జాతీయబుక్ ఆఫ్ ట్రస్టు సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ స్వర్గీయ దేశ ప్రధాని ఇందిరాగాంధికి తెలుగుభాష రాకున్నా ఒగ్గుకథ కళతో అందులోని మాధ్యుర్యాన్ని పంచిపెట్టిన ఘనత మిద్దె రాములుకే దక్కిందన్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఇచ్చిన కళ మాత్రం సజీవంగా ఉండిపోతుందని చెప్పారు. అనంతరం కళా ప్రదర్శనల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్, ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఆదిలాబాద్ రేడియో సహాయ సంచాలకులు సుమనస్పతిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, మిద్దె రాములు ట్రస్టు ఫౌండర్ మిద్దె పర్శరాములు, కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు యెల్ల పోచెట్టి పాల్గొన్నారు.
రాజన్న సన్నిధిలో పూజలు
వేములవాడ రాజన్నను రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవుళపల్లి ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.