ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
కీసర : ప్రేమికుల దినోత్సవం రోజే ఓ యువతికి అన్యాయం జరిగింది. మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు ముఖం చాటేశాడు. పోలీసులు కౌన్సెలింగ్ చేసి నా అతడి మనసు మారలేదు. దీంతో బాధితురాలు మహిళాసంఘం నేతలతో ప్రియుడి ఇంటిఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన శనివారం కీసర మండలం భోగారంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాంపల్లిదాయరకు చెందిన మమత (21) తల్లిదండ్రులు మూడేళ్లక్రితం మృతిచెందారు. దీంతో ఆమె భోగారంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చీర్యాలలోని సెరినిటీ పాఠశాలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన సుంకరి సాయికిరణ్‌రెడ్డి(22) ఇంటర్ పూర్తిచేసి వ్యవసాయపనులు చేస్తున్నాడు.
మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారం క్రితం చీర్యాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద మమతకు పసుపుకొమ్ముతో తాళికట్టిన సాయికిరణ్ మరుసటిరోజు నుంచి మాటమార్చాడు. దీంతో బాధితురాలు కీసర పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయికిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సంఘాల నేతలు అతడికి ఠాణాలో సర్దిచెప్పగా పెళ్లి చేసుకుంటానని అంగీకరించారు. వారు వరుడు, వధువు కోసమని నూతన వస్త్రాలు, తాళిమెట్టెలు తీసుకొచ్చారు. అంతలోనే సాయికిరణ్‌రెడ్డి బంధువులు వచ్చి అతడి మనసు మార్చగా వివాహానికి నిరాకరించాడు.
దీంతో బాధితురాలు మహిళా సంఘాల నేతలతో కలిసి భోగారంలోని సాయికిరణ్‌రెడ్డి ఇంటి ఎదుట శనివారం సాయంత్రం ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి జరిగేదిలేదని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై కీసర సీఐ గురువారెడ్డిని వివరణ కోరగా మమత ఫిర్యాదు మేరకు సాయికిరణ్‌రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు.