జీవితాంతం ‘ఎమ్మెల్యే’నే
పేరులోనే ఆ పదవిని పొదువుకున్న గోవలంక యువకుడు
ఇంటిపేరు.. ‘కాశి’, పేరు.. ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’
దాసరి సినిమా స్ఫూర్తితో నామకరణం చేసిన తండ్రి
తాళ్లరేవు :
‘ఫలానా ఆయన ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు’ అని గొప్పగా చెప్పడం వింటుంటాం. అలాగే ఎమ్మెల్యేగా ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించిన వారూ ఉన్నారు. అలాంటి వారు కూడా మండలంలోని గోవలంకకు చెందిన 24 ఏళ్ల ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ ముందు ఓ రకంగా ‘చిన్న’బుచ్చుకోవలసిందే. ఎందుకంటే.. ఎమ్మెల్యేలుగా ఎన్ని హ్యాట్రిక్‌లు సాధించిన గొప్ప నాయకులైనా ఒకప్పటికి మాజీలై తీరతారు. కానీ.. ఏడుకొండలు మాత్రం ఎన్నటికీ ‘మాజీ ఎమ్మెల్యే’ కాబోరు. ‘ఇదేమిటి? ఎలా సాధ్యం?’ అనుకుంటున్నారా.. అది ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే.. ఆయనకు సంబంధించి ‘ఎమ్మెల్యే’ అన్నది అయిదేళ్ల కాలానికి దక్కించుకున్న పదవి కాదు.. ఆయన పేరులో భాగం. ఆయన ఇంటి పేరు ‘కాశి’. పేరు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’. ఆయన తండ్రి ధనరాజు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అభిమాని. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను తప్పక చూసేవారు. రెండున్నర దశాబ్దాల క్రితం దాసరి దర్శకత్వంలో వచ్చిన రాజకీయ వ్యంగ్య చిత్రం ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సంచలనం సృష్టించింది. ఆ సినిమా ధనరాజుకు తెగనచ్చేసింది. ఆ స్ఫూర్తితో, కొడుకు ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతోనే ఆ సమయంలో పుట్టిన బిడ్డకు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ అని పేరు పెట్టారు. తండ్రి ఆకాంక్షకు అనుగుణంగా ఎన్నటికైనా ‘ఎమ్మెల్యే’ కావాలన్నదే తన ఆశ అని చెపుతున్న ఈ యువకుడు.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్త. పార్టీ నిర్వహిస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో
ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.