దళం..దడ
మన్యం మరోసారి ఉలిక్కిపడింది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు అస్త్ర సన్యాసం చేస్తే..మరోవైపు పోలీసులు గిరిజనులపై ఆయుధం ప్రయోగించారు. ఏక కాలంలో చోటుచేసుకున్న ఈ రెండు సంఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా జరుగుతున్న వరుస సంఘటనలు, మావోయిస్టుల ప్రాబల్యం, పోలీసుల ఆధిపత్యానికి జరుగుతున్న యుద్ధంలా కనిపిస్తోంది. ఈ సంఘర్షణలో అమాయక గిరిజనులు నలిగిపోతున్నారు.
- లొంగిపోయిన డిప్యూటీ కమాండర్
- మావోయిస్టులకు ఎదురు దెబ్బ
- అదే సమయంలో ఏజెన్సీలో కాల్పులు
- మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, విశాఖపట్నం: కోరుకొండ ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ వంతల మల్లేష్ విశాఖ రేంజ్ డిఐజీ ఎ.రవిచంద్ర ఎదుట శుక్రవారం లొంగిపోయాడు. ఓ వైపు ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడిస్తున్న సమయంలోనే జీకేవీధి మండలం చెరుకుంపాకలు గ్రామస్తులపై పోలీసులు కాల్పులు జరిపారనే వార్త వెలువడింది. కుంకుమపూడికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బు వసూలుకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో మాటువేసిన పోలీసులు దళసభ్యులను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులకు పాల్పడ్డారని, ఒక మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు గ్రామస్తులపై కాల్పులు జరపడం విమర్శలకు తావిస్తోంది. అదృష్టవశాత్తు కాల్పుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు.
లేదంటే అమాయకులు బలయ్యేవారు. ఇక డీఐజీ ఎదుట లొంగిపోయిన మల్లేష్ చింతపల్లి మండలం బలపం పంచాయతీ కిష్టవరం గ్రామానికి చెందిన వాడు. ఆ గ్రామం గురించి పోలీసు శాఖలో తెలియని వారుండరు. మావోయిస్టులకు కంచుకోట. 2008లో ఇక్కడి కాఫీ తోటల పంపకాల దగ్గర్నుంచి మావోయిస్టు పార్టీలోకి క్రియాశీలకంగా అడుగుపెట్టిన మల్లేష్ కోరుకొండ ఏరియా కమిటీ కమాండర్ నవీన్ తర్వాత స్థానానికి చేరుకున్నాడు. ఈ స్థాయికి రావడానికి అనేక హత్యలు, దోపిడీలు, దాడుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నాడు. కొన్ని నెలల క్రితం మావోయిస్టులు గిరిజనులను కాల్చి చంపడంతో వీరవరంలో గిరిజనులు మావోయిస్టులపై తిరగబడి కొందరిని అంతమెందించారు.
అప్పటి నుంచీ మావోయిస్టులకు, గిరిజనులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. తమ వారిని చంపిన 20 మంది గిరిజనులను చంపేస్తామని మావోయిస్టులు శపథం చేసి వారి కోసం వేటాడుతున్నారు. ఇలా గిరిజనులే గిరిజనులను చంపుకోవడం నచ్చకే ఉద్యమాన్ని వదిలేశానని మల్లేష్ పేర్కొంటున్నాడు. అంతేకాక పార్టీ సిద్ధాంతాలు నచ్చ లేదని అతను చెప్పడం మావోయిస్టులను ఇరకాటంలో పెట్టే అంశం. అంతేకాకుండా లొంగిపోయిన ఇతడు ఇచ్చిన సమాచారమే చెరుకుంపాకల సంఘటనకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.