డిజిటల్ పోలీసింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నారు. నూతన ఒరవడులను అందిపుచ్చుకొని శాఖ ప్రక్షాళనకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. అందులో భాగంగా పోలీసు కార్యాలయాల్లో కాగితరహితంగా, మరింత పారదర్శకంగా సేవలందించాలని నిర్ణయించారు. పూర్తిగా డిజిటల్‌మయంగా మార్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ‘కేఎం ఆటం (నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఆటోమేషన్)’ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ నూతన టెక్నాలజీపై మార్చి 2 నుంచి టెస్టింగ్‌లు నిర్వహించి సమస్యలను సరిచేశారు.
మొదట దీన్ని డీజీపీ కార్యాలయంలో పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించి నేటి (మంగళవారం) నుంచి ఫైళ్లంటినీ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే ఉన్నతాధికారులకు చేరేలా ఆదేశాలిచ్చారు. ఇందుకు డీజీపీ కార్యాలయంలోని 210 మంది కింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అలాగే త్వరలో అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాలతో పాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ)లో వినియోగించేందుకు టెక్నికల్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
కేసుల పురోగతితో పాటు ఫైళ్ల స్థితిగతులను సులభంగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేఎం ఆటం అప్లికేషన్ దోహదపడుతుంది. ఏ ఫైల్ ఎక్కడ, ఎవరి వద్ద ఎంత కాలం నుంచి ఉందనే విషయాలు వెంటనే తెలిపోతాయి. దీని ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకత రావడంతో పాటు సిబ్బందిలో అలసత్వం వీడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఫైల్ డీల్ చేసే ప్రతి సిబ్బంది ఎలక్ట్రానిక్ సంతకాన్ని కూడా రికార్డు చేసేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. అధికారులు ఎక్కడున్నా ల్యాప్‌టాప్, ట్యాబ్ ద్వారా ఫైల్స్ చూసుకోవచ్చు.