Dil Dhadakne Do
-
స్నేహితురాలి కోసం అతిథిగా...
హృతిక్ రోషన్ ‘దిల్ ధడక్నే దో’లో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ చిత్రదర్శకురాలు జోయా అక్తర్, హృతిక్ మంచి స్నేహితులు. ఆమె దర్శకత్వంలో ‘లవ్ బై చాన్స్’, ‘జిందగీ న మిలేగీ దొబారా’లో హృతిక్ చేశారు. ఇప్పుడీ సినిమా చేస్తారట! -
అతను సెట్లో ఉంటే నవ్వులే నవ్వులు!
‘‘కొన్ని చిత్రాలు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ‘దిల్ ధడక్నే దో’ అలాంటి ఆ కోవలోకే వస్తుంది’’ అని ప్రియాంకా చోప్రా అంటున్నారు. ఈ చిత్రం తనకెందుకు అంత మంచి అనుభూతిని మిగిల్చిందో ప్రియాంక చెబుతూ -‘‘నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఆ యూనిట్లో ఉన్న అందరితో స్నేహంగా ఉండడం నా అలవాటు. ఈ చిత్రంలో నేను, అనుష్క శర్మ నటిస్తున్నాం. అనుష్క శర్మ మంచి నటి. అలాగే, తనకు ఎలాంటి పాత్రలు నప్పుతాయో ఆమెకు బాగా తెలుసు. ఉన్నమాట చెప్పాలంటే, అనుష్క వల్ల ‘దిల్ ధడక్నే దో’ సినిమాకు మరింత అందం వచ్చింది. ఈ సినిమాకు ఆమె పాత్ర చాలా కీలకం. ఈ చిత్రం కోసం అనుష్క, నేను, ఇతర తారాగణం పాల్గొనగా చిత్ర దర్శకురాలు జోయా అక్తర్ ఓ పాట చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో చాలా ఎంజాయ్ చేశాం. ఒకరితో ఒకరు పోటీ పడుతూ షాట్ గ్యాప్‌లో గేమ్స్ ఆడుకునే వాళ్లం. అనుష్క, నేను కలిస్తే మా అల్లరికి అంతు ఉండేది కాదు. చాలా చిలిపి సంభాషణలు మా మధ్య దొర్లేవి. ఇక, చిత్రకథానాయకుడు రణవీర్ సింగ్ గురించి చెప్పాలి. ఆయన చాలా మంచి నటుడు. అలాగే చాలా సరదా వ్యక్తి కూడా. రణవీర్ సెట్స్ పై ఉన్నాడంటే ఇక నవ్వులే నవ్వులు. అతనితో సినిమా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను’’ అన్నారు. -
అది నిజం కాదుగా అనుష్కా!
తనకు ఒంట్లో బాగోకపోవడం వల్ల తన కొత్త సినిమా ‘దిల్ ధడక్నే దో’ ప్రమోషన్ని మిస్ అవుతున్నానని, ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా వెళ్లలేకపోతున్నానంటూ బాలీవుడ్ నటి అనుష్కాశర్మ తాజాగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌ను చూసి ‘అమ్మ అనుష్కా’ అంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇటీవలే అనుష్క హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యింది. దాంతో మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. అప్పుడిచ్చింది అనుష్క ఈ ట్వీట్. మరి అందులో ఆశ్చర్యపోవలసింది ఏముందనేగా! ఉంది. అనుష్క ఐపీఎల్ చూడ్డానికి వెళ్లకపోవడానికి కారణం అనారోగ్యం కాదు. మొన్న ఓరోజు మ్యాచ్ బ్రేక్‌లో విరాట్ కోహ్లీ గాళ్‌ఫ్రెండ్ అనుష్కతో ఏకాంతంగా కబుర్లాడుతూ అధికారులకు దొరికిపోయాడు. అలా చేయడం రూల్స్‌కి వ్యతిరేకం కాబట్టి అధికారులు గుస్సా అయ్యి, విరాట్ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. విరాట్ కెరీర్‌ని అనుష్క పాడు చేస్తోందంటూ మీడియాలో వార్తలు సైతం ప్రచురితమయ్యాయి. దాంతో తప్పనిసరై అనుష్క ఆ మ్యాచ్‌లకు దూరంగా ఉంది తప్ప అనారోగ్యం కారణంగా కాదు. అదీ అసలు సంగతి! -
ఆ వేడుక కోసం నాలుగు రోజులు సెలవు!
ప్రియాంకా చోప్రా ఒకరకమైన ఉద్వేగంతో ఉన్నారు. జీవితంలో ఇప్పటివరకూ ఎప్పుడూ కలగని ఓ కొత్త అనుభూతికి గురయ్యారు ఈ బ్యూటీ. కారణం అలాంటిది మరి.. ప్రియాంకా చోప్రా తండ్రి అశోక్ చోప్రా గత ఏడాది చనిపోయారు. దాదాపు 27 ఏళ్లు సైనిక దళంలో సేవలందించిన ఘనత ఆశోక్ చోప్రాది. ఆయన జ్ఞాపకార్థం ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ రోడ్‌కి ‘లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ చోప్రా మార్గ్’ అని పేరు పెట్టారు. ఈ రహదారి ఆవిష్కరణ నేడు జరగనుంది. తండ్రికి దక్కిన గౌరవాన్ని కళ్లారా వీక్షించాలనుకున్న ప్రియాంకా చోప్రా యూరప్ నుంచి ముంబయ్ చేరుకున్నారు. ‘దిల్ దడఖ్నే దో’ చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నారామె. దర్శక, నిర్మాతలకు విషయం చెప్పి, ఓ నాలుగు రోజులు అనుమతి కోరారట ప్రియాంక. ఇది అరుదైన వేడుక కాబట్టి, ప్రియాంక కోరికను మన్నించి ఆమెకు నాలుగు రోజులు సెలవిచ్చేశారు. ముంబయ్ చేరుకున్న ప్రియాంక మాట్లాడుతూ -‘‘ఈ గౌరవానికి మా నాన్నగారు పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సేవ చేయడానికి నాన్నగారెప్పుడూ వెనకాడలేదు. ఆ సేవలకు తగిన గుర్తింపు లభించింది. నాన్నగారికి ముంబయ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ మహానగరంలో రహదారి ఉండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.