ఆ వేడుక కోసం నాలుగు రోజులు సెలవు!
ప్రియాంకా చోప్రా ఒకరకమైన ఉద్వేగంతో ఉన్నారు. జీవితంలో ఇప్పటివరకూ ఎప్పుడూ కలగని ఓ కొత్త అనుభూతికి గురయ్యారు ఈ బ్యూటీ. కారణం అలాంటిది మరి.. ప్రియాంకా చోప్రా తండ్రి అశోక్ చోప్రా గత ఏడాది చనిపోయారు. దాదాపు 27 ఏళ్లు సైనిక దళంలో సేవలందించిన ఘనత ఆశోక్ చోప్రాది. ఆయన జ్ఞాపకార్థం ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ రోడ్‌కి ‘లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ చోప్రా మార్గ్’ అని పేరు పెట్టారు. ఈ రహదారి ఆవిష్కరణ నేడు జరగనుంది. తండ్రికి దక్కిన గౌరవాన్ని కళ్లారా వీక్షించాలనుకున్న ప్రియాంకా చోప్రా యూరప్ నుంచి ముంబయ్ చేరుకున్నారు.
‘దిల్ దడఖ్నే దో’ చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నారామె. దర్శక, నిర్మాతలకు విషయం చెప్పి, ఓ నాలుగు రోజులు అనుమతి కోరారట ప్రియాంక. ఇది అరుదైన వేడుక కాబట్టి, ప్రియాంక కోరికను మన్నించి ఆమెకు నాలుగు రోజులు సెలవిచ్చేశారు. ముంబయ్ చేరుకున్న ప్రియాంక మాట్లాడుతూ -‘‘ఈ గౌరవానికి మా నాన్నగారు పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సేవ చేయడానికి నాన్నగారెప్పుడూ వెనకాడలేదు. ఆ సేవలకు తగిన గుర్తింపు లభించింది. నాన్నగారికి ముంబయ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ మహానగరంలో రహదారి ఉండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.