పేపర్ మిల్లు యాజమాన్యం మెడలు వంచుదాం
నిరంకుశంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం
కార్మికుల్ని డిస్మిస్ చేయడం అన్యాయం
అన్ని యూనియన్లు కలిసికట్టుగా రావాలి
అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం ఇంటర్నేషనల్ పేపర్‌మిల్లు యాజమాన్యం తీరుపై పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక యూనియన్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్మికుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి ప్రశ్నించిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ మిల్లు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. పేపరుమిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కల్యాణ మండపంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మీసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షతవహించిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పేపరుమిల్లు యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. దాని మెడలు వంచి కార్మికులకు న్యాయం చేసేందుకు అన్ని యూనియన్లు కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిల్లు స్థానికంగా ఉన్న అన్ని వసతులను వినియోగించుకుంటూ విదేశీ చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కుటుంబ సభ్యుల ఉద్యోగాల నియామకంపై ప్రశ్నించిన 33 మంది యూనియన్ నాయకులను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. చర్చల అనంతరం 21 (ఒకరు మృతి చెందగా, మరొకరు పదవీ విరçమణ పొందారు) మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. మిగిలిన 10 మందిని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర కార్మికశాఖ మంత్రులు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.
సమస్యపై పోరాటం చేసిన 33 మందిపై ఒకే విధంగా చర్యలు చేపట్టాల్సిన మిల్లు యాజమాన్యం విభజించి పాలించే విధాన్ని అమలు చేసి కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్న యాజమాన్యంపై పోరాటం చేసేందుకు పార్టీలకు అతీతంగా అన్ని యూనియన్లు కలసిరావాలన్నారు. కార్మికులకు పూర్తి న్యాయం జరిగేంతవరకూ పోరాటానికి తాను మందుంటానని ఆయన చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పేపరుమిల్లు ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి, ఐఎన్టీయూసీ నాయకుడు జోషి, సీపీఎం నాయకులు టి.అరుణ్, ఐఎఫ్టీయూ జె.వి.రమణ, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మల్లారెడ్డి వెంకట్రావ్, ఏఐటీయూసీ నేత కిర్ల కృష్ణారావు, కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, బీజేపీ నగర మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రమణ్యం సింగ్, పలువురు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా ఉంటా
పేపరుమిల్లు యాజమాన్యం వింతపోకడలతో ముందుకువెళ్తోంది. గతంలో ఎçప్పుడూ లేని విధంగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ ఏ తప్పు లేకుండా కార్మికుల్ని సస్పెండ్ చేసిన సంఘటనలు లేవు. కార్మికుల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. - రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్
డిస్మిస్ చేయడం అన్యాయం
కార్మికులను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. గతంలో ఎప్పుడూ ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి లేదు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కార్మికులంతా కలసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. - టి.కె.విశ్వేశ్వరరెడ్డి, పేపరుమిల్లు ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు
కార్మికులకు తీరని ద్రోహం
మిల్లు యాజమాన్యం సమస్యలపై ప్రశ్నించిన కార్మికులను తొలగించి తీరని ద్రోహం చేసింది. కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే ఈ దురవస్థ ఏర్పడింది. సమస్య వస్తే కార్మికులంతా కలసికట్టుగా ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుంది. కార్మిక నాయకులు ఇప్పటికైనా ఏకతాటిపై వచ్చి పోరాటం చేయాలి.
- చిట్టూరి ప్రభాకర చౌదరి, మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం
అధికారులు యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారు
న్యాయం కార్మికుల పక్షాన ఉన్నా కార్మికశాఖ అధికారులు మాత్రం పేపరుమిల్లు యాజమాన్యం కొమ్ముకాస్తున్నట్టుగా ఉంది. కార్మికులపై గతంలో ఏ విధమైన ఇబ్బందికర అభియోగాలు లేకపోయినా డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించడం కార్మికుల గొంతు కోసే ప్రయత్నం. యూనియన్లు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే.. అవి లేకపోతే కార్మికులు అనుక్షణం చిత్రవధతో బానిసలుగా ఉద్యోగాలు చేయాల్సివస్తుంది.
- జోషి, ఐఎన్టీయూసీ నాయకుడు