దీపికకు అతడే స్ఫూర్తి.. దీప్తి!!
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ మహిళా స్క్వాష్ ప్లేయర్లు దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప స్వర్ణపతకం సాధించారు. అయితే, వాళ్లలో దీపిక గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ట్విట్టర్లో అయితే, వాళ్లు విజేతలుగా నిలిచిన శనివారం రాత్రంతా దీపిక గురించే కబుర్లు నడిచాయి. అయితే.. ఆమెను ముందుండి నడిపించింది, దీపికకు స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా.. క్రికెటర్ దినేష్ కార్తీక్. 2013 నవంబర్‌లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ చెన్నై సుందరి, దినేష్ కార్తీక్ ఇద్దరూ ఒకే కోచ్ వద్ద ఫిట్నెస్ పాఠాలు నేర్చుకోవడంతో అక్కడే వీరిద్దరి ప్రేమపాఠాలు కూడా కొనసాగాయి.
అది చివరకు ఎక్కడివరకు వెళ్లిందంటే.. ''ఆ మేజికల్ రోజున నావాడు నాకు తోడుంటే ఎంత బాగుండేదో'' అని ఆమె ట్వీట్ చేసింది. దాంతోపాటే వాళ్లిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటో కూడా పెట్టింది. దాంతో దినేష్ కార్తీక్ కూడా తనకు కాబోయే భార్య సాధించిన విజయం పట్ల చాలా గర్వంగా ఉందంటూ చెప్పాడు. అంతేనా.. కార్తీక్ ఐపీఎల్లో ఆడుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అయితే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరే ముందు కార్తీక్ స్వయంగా వచ్చి విమానాశ్రయంలో తనకు కాబోయే భార్యామణిని దింపాడు. కనీసం ఒక్క పతకమైనా తీసుకురావాలని ఆమెకు మరీ మరీ చెప్పాడు. తొలిసారి ఆమె స్క్వాష్ మ్యాచ్ చూసినప్పటినుంచే దినేష్ కార్తీక్ పల్లికల్‌తో ప్రేమలో పడిపోయాడు.
So glad I could have my man with me on such a magical day! @DineshKarthik pic.twitter.com/1Za4qSAKzd
— Dipika Pallikal (@DipikaPallikal) August 2, 2014