ఉపాధి శిక్షణ శాఖలో కుంభకోణం లేదు
డెరైక్టర్ వరప్రసాద్ వివరణ
సాక్షి, అమరావతి : ఉపాధి శిక్షణ శాఖలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందనటంలో వాస్తవం లేదని కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి శిక్షణ శాఖ మాడ్యులర్ ఎంప్లాయ్మెంట్ పథకానికి సంబంధించి రూ. 10 కోట్లు 2015 మార్చి 23న ఎస్బీహెచ్లో డిపాజిట్ చేశారని, ఆ డిపాజిట్లు గల్లంతైన కేసులో జాయింట్ డెరైక్టర్ జి.మునివెంకటనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్ వీటీ తోడరమల్లు సీబీఐ విచారణకు వెళ్లి వచ్చారని చెప్పారు.
2015 నవంబరు 13న డిపాజిట్ చేసిన రూ.10 కోట్లు డ్రా చేసేందుకు హైదరాబాద్లోని నల్లకుంట బ్రాంచికి వెళ్ళగా వారు రూ. 2.50 కోట్లు మాత్రమే అప్పుడు చెల్లించారని తెలిపారు. అప్పటికే పలు ప్రభుత్వ శాఖలకు చెందిన నిధులు గల్లంతైనట్లు తెలిసిందని, దీంతోనే ఈ కేసును ఎస్బీహెచ్ సీబీఐకి అప్పగించిందని చెప్పారు. తర్వాత నల్లకుంట బ్రాంచి వారు 2016 ఫిబ్రవరి 19న రూ. 8.16 కోట్లు వడ్డీతో కలిపి ఉపాధి కల్పన శాఖకు ఇచ్చివేశారన్నారు. అయితే విచారణ సంద ర్భంగా సీబీఐ వారు పిలిచినప్పుడు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే ఇరువురూ సీబీఐ కార్యాలయానికి వెళ్ళి రికార్డులు చూపించి వచ్చినట్లు ఆయన తెలిపారు.