నేను రైతు బిడ్డను..
* సామాన్యుల సమస్యలకు సత్వరమే పరిష్కారం
* శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
* సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా
* జిల్లా ఎస్పీగా సుమతి బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా బి.సుమతి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డిలోని డీపీఓ కార్యాలయంలో శెముషీ బాజ్‌పాయ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సుమతి మాట్లాడారు. ‘నేను రైతు బిడ్డను, సామాన్యుల కష్టా లు నాకు తెలుసు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాన’ని చెప్పారు.
ఇందుకోసం అన్ని పోలీస్స్టేషన్లలో వచ్చిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. సీఎం సొంత జిల్లాగా ప్రాముఖ్యత ఉన్నం దున కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ప్రజలతో పోలీసులు మమేకమయ్యేలా చూస్తామని చెప్పారు. ముఖ్యంగా నేరాల అదుపు కోసం పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. పోలీసులంతా ఓ కుటుంబంలా పనిచేస్తూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడతామని చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో ప్రజలు ఏ సమస్య ఎదుర్కొంటున్నా వాటిని నిర్భయంగా పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు ను తప్పకుండా పరిష్కారమయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు దినం కేటాయింపు విషయంలో సిబ్బంది కొరత వుందని, సిబ్బంది పూర్తిస్థాయిలో నియామకమైన వెంటనే సెలవు దినాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నక్సల్స్ సమస్య ఏమాత్రం లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉంటే జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై జిల్లా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతిని ఏఎస్పీ పి.రవీందర్‌రెడ్డితో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కలిసి అభినందించారు.
గణేష్ ఆలయంలో ఎస్పీ సుమతి పూజలు
సంగారెడ్డి క్రైం: జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన బి.సుమతి పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికారు. జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యులు, కౌన్సిలర్ జి.వి. వీణా శ్రీనివాస్‌రావు దంపతులు ఎస్పీకి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.