దీపావళి ఖర్చులకూ మినహాయింపు!
కొన్ని విరాళాలు, ఖర్చులపై 125 శాతం కూడా...
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఒకటి గానే పరిగణిస్తారు. వ్యాపారాన్ని, వృత్తిని చట్టంలో నిర్వచించారు. అసెసీ స్వయంగా ఆర్జించినా, ఏజెంట్ ద్వారా ఆర్జించినా దాన్ని ఆదాయంగా పరిగణి స్తారు. వచ్చిన ఆదాయం/అమ్మకాల విలువ/సర్వీసుల విలువలోంచి వ్యాపారం, వృత్తి చేయటానికి అవసరమైన ప్రతి ఖర్చుని మినహాయిస్తారు. ఖర్చు ఎంతయ్యిందో అంత ఇవ్వడం సహజం.
ఇవి కాకుండా కొన్నిసార్లు వంద రూపాయలు ఖర్చుపెడితే వందాపాతిక మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకి రూల్స్ ప్రకారం.. శాస్త్రసాంకేతిక పరిశోధనల కోసం ఇచ్చిన మొత్తం, అలాగే నేషనల్ లేబొరేటరీ, విశ్వ విద్యాలయం, ఐఐటీలకు ఇచ్చే మొత్తాల మీద రెండింతల మినహాయింపు ఇస్తారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి సాధారణంగా పెద్దపెద్ద కంపెనీలకు, సంస్థలకు సాధ్యమవుతుంది.
మనం ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు తదితర వారి విషయాన్ని మాత్రమే పరిశీలిద్దాం. ఎంటర్టైన్మెంట్, బహుమతులు, ట్రావెలింగ్, గెస్ట్‌హౌస్ నిర్వహణ, విదేశీయానం, దీపావళి ఖర్చులు... ఇలా ఎన్నో ఖర్చులకు మినహాయింపు ఉంటుంది.మీరు గుర్తించవలసిన విషయాలు.. ప్రతి ఖర్చుకి సంబంధించిన కాగితాలను, వోచర్లను, అకౌంట్లను భద్రపరచాలి. నిజంగా ఖర్చుపెట్టి ఉండాలి. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే కావాలి.
ఈ ఖర్చులకు మినహాయింపు ఉండదు
* వ్యక్తిగత ఖర్చులు
* స్థిరాస్తులు, ఇతర ఆస్తులు
* రుణం చెల్లింపులు
* అప్పులు/చేతిబదులు/అడ్వాన్సుల చెల్లింపులు
* వినాయక చవితి/ దసరా విరాళాలు
* పూజ ఖర్చులు
* ఆదాయపు పన్ను
* ఆస్తి పన్ను
* అసమంజసమైన, వివరణలేని ఖర్చులు
* సంబంధం లేని ఖర్చులు
* బంధువులకు ఇచ్చే జీతభత్యాలు (సమంజసం కాకపోతే)
* నగదు చెల్లింపులు.. రూల్స్ ప్రకారం, ఏదేని చెల్లింపు రూ.20,000 దాటితే కచ్చితంగా అకౌంట్ పేరు, చెక్కు ద్వారా/ డీడీ ద్వారా చెల్లించవలసిందే. అలా కాని పక్షంలో ఆ చెల్లింపుల ద్వారా చేసిన ఖర్చులకు మినహాయింపులు ఉండవు.
రిటర్నులు ఎలా వేయాలి?
* గడువు తేదీ లోపల రిటర్నులు వేయండి.
* నికర ఆదాయం రూ.5 లక్షలు దాటితే ఈ-ఫైలింగ్ చేయాలి.
* ఇతరులు డిపార్ట్మెంట్కు వె ళ్లి ఫైల్ చే యొచ్చు.
* గడువు తే ది లోపల ఫైల్ చేయకపోతే నష్టాన్ని రాబోయే సంవత్సరం సర్దుబాటు చేస్తారు.
* అకౌంటింగ్ మెథడ్‌ను సక్రమంగా పాటించాలి.
* కొత్తగా వచ్చిన స్టాండర్డ్స్‌ని పాటించాలి.
* స్టాక్‌ను సక్రమంగా వాల్యూ చేయించాలి.
* బుక్స్ రాయించాలి.(ట్రక్లు నడిపేవారు, ట్రాన్స్పోర్ట్ వాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు. టర్నోవర్/వసూళ్లు రూ.కోటి దాటని వారు వారి లాభ శాతం 8 % దాటి చూపిస్తే బుక్స్ రాయనక్కర్లేదు.)
* ట్యాక్స్ ఆడిట్ అవసరమైతే చేయించాలి.
* బుక్స్ రాయకపోయినా, ఆడిట్ చేయించకపోయినా పెనాల్టీ పడుతుంది.
ట్యాక్సేషన్ నిపుణులు :
1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి,
2. కె.వి.ఎన్ లావణ్య