జర్నలిస్టులపై దాడికి దిగిన డీఎంకే కార్యకర్తలు అరెస్టు
చెన్నై:డీఎంకే నేత స్టాలిన్ ఇంటిముందు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన 14 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆదివారం పార్టీ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులపై డీఎంకే కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో దాడికి దిగిన డీఎంకే కార్యకర్తలను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీఎంకే పార్టీ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, కొంతమందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు.
క్‌సభ ఎన్నికల్లో ఓటమిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎంకే ఆదివారం హైడ్రామానే నడిపింది. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తన పదవులకు రాజీనామా, కార్యకర్తల ఆందోళన, అంతలోనే ఉపసంహరణ చకచకా సాగి పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 35 సీట్లలోనూ, మిత్రపక్షాలు ఐదు సీట్లలోనూ పోటీచేశాయి. పుదుచ్చేరి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా పార్టీ దక్కించుకోలేకపోయింది. రాష్ట్రంలోని 39 స్థానాల్లోకి 37 స్థానాలను అన్నాడీఎంకే ఎగరేసుకుపోగా, మిగిలిన రెండు స్థానాలు బీజేపీ, పీఎంకే దక్కించుకున్నాయి. దీంతో స్టాలిన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, అంతలోనే తిరిగి మనసు మార్చుకోవడం అంతా ఒకదాని వెంటే జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై స్టాలిన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.