కాలేయ కేన్సర్‌కు ల్యాప్రోస్కోపిక్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాలేయ కేన్సర్.. ఎంతోమంది దీనివల్ల మృత్యువాత పడ్డారు. దీని చికిత్స సైతం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు.. చికిత్సకోసం ఛాతీపై భారీగా కోతలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడీ పరిస్థితికి తెరపడింది. ల్యాప్రోస్కోపిక్ విధానంతో కాలేయంలోని కేన్సర్ గడ్డలను సులభంగా తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఛాతీపై భారీ కోతలకు స్వస్తి చెబుతూ కేవలం 2.5 సెంటీమీటర్ల రంధ్రంతోనే కాలేయంలోని కేన్సర్ గడ్డలను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు.
గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు (57), ఒంగోలుకు చెందిన అబ్దుల్ రషీద్ (50) అనే రోగులకు ఈ విధానం ద్వారా ఇటీవల లివర్ కేన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేశారు. దీనిపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ కె.రవీంద్రనాథ్, ఇతర వైద్యులు మాట్లాడారు. ఈ విధానం వల్ల రోగి త్వరగా కోలుకోవడంతోపాటు వైద్యానికవుతున్న ఖర్చు కూడా తగ్గుతుందని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.
లాప్రోస్కోప్లో కొత్తగా వచ్చిన 3డీ ైడెమైన్షన్ కెమెరా ద్వారా కేన్సర్ కణాలను సులభంగా గుర్తించడంతోపాటు వాటిని తొలగించే అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ చికిత్సను ప్రస్తుతం గ్లోబల్ అస్పత్రులలో మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ టాం చెరియన్ మాట్లాడుతూ.. 70 శాతం మంది వ్యాధి ముదిరాకే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు.
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్-బి, సి వైరస్ ఇన్ఫెక్షన్లతోపాటు మధుమేహం, అధిక బరువు కాలేయ కేన్సర్‌కు కారణమని తెలిపారు. హెపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్కపూర్ మాట్లాడుతూ దేశంలో ఏటా 50 వేలమంది కాలేయ కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు.