‘లండన్ స్కూల్’ కు ఓయూ ఫ్యాకల్టీ
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో అధ్యయనం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీకి అవకాశం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 50 మందితో కూడిన అధ్యయన బృందాన్ని కేంద్రం ఎంపిక చేసింది. అంబేద్కర్ ఆ స్కూల్లో చదువుకునే రోజులకు, ప్ర స్తుత పరిస్థితులకు ఉన్న సామాజిక స్థితిగతులపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.
ఓయూలో సోషల్‌వర్క్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ కసుప బాలరాజు ఈ బృందంలో ఒకరు కావడం విశేషం. అక్టోబర్ 24 నుంచి 31 వరకు ఈ అధ్యయనం కొనసాగనుంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బాలరాజును ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.