కూతుర్ని చంపి.. తానూ కాల్చుకున్న డాక్టర్!!
కేన్సర్‌తో పోరాడుతున్న ఓ వైద్యుడు.. ఇక తనకు మరణం తప్పదని నిర్ణయించుకున్నాడు. తన తర్వాత కన్న కూతుర్ని తనంత ప్రేమగా ఎవరూ చూసుకోలేరని భావించాడో ఏమో, ఆమెను చంపి.. తర్వాత తనను తాను తుపాకితో కాల్చుకున్నాడు!! ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వైభవ్ నగర్ ప్రాంతంలో జరిగింది. కేన్సర్‌తో బాధపడుతున్న డాక్టర్ లాఖన్ సింగ్ శుక్రవారం ఉదయం తన కుమార్తెను కాల్చి చంపి, అక్కడికక్కడే తనను తాను కూడా కాల్చుకున్నారు.
డాక్టర్ లాఖన్ సింగ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ సంఘటన జరిగే సమయానికి ఆయన భార్య వంట చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు వేరే గదిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యాధి కారణంగా తీవ్ర మనోవ్యథకు గురై ఉంటారని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డారని అంటున్నారు.