కంటిజబ్బుకు నానో చికిత్స
- సీసీఎంబీ శాస్త్రవేత్తల ఘనత
- సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కనుగుడ్డును దెబ్బతీసి చివరకు అంధత్వానికి దారితీసే కెరటైటిస్ అనే వ్యాధికి తాము నానో కణాల ద్వారా చికిత్సను అభివృద్ధి చేసినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహన్‌రావు తెలిపారు. ఫంగస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వ్యవసాయ పనులు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుందని, తగిన చికిత్స అందించకపోతే వ్యాధి సోకిన వారిలో కనీసం 30 శాతం మంది శాశ్వత అంధత్వానికి గురవుతారని ఆయన వెల్లడించారు.
సీసీఎంబీ మాతృసంస్థ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెరటైటిస్ కారక ఫంగస్‌ను నాశనం చేసేందుకు ఓ ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాన్ని సిద్ధం చేశామని, దాన్ని కనుగుడ్డుపై ఎక్కువసేపు ఉండే లా చేసేందుకు నానోకణాల ను ఉపయోగించామని తెలి పారు. ఈ నానోకణాలు ఇన్ఫెక్షన్ స్థాయికి తగ్గట్టుగా మం దు విడుదల చేస్తాయని, జంతువుల్లో జరిగిన ప్రయోగాలు ఇప్పటికే సత్ఫలితాలిచ్చాయని చెప్పారు.
ఈ చికిత్స విధానం మొత్తానికి పేటెంట్ పొందేందుకు దరఖాస్తు చేశామని, ప్రభుత్వ అనుమతితో త్వరలో మానవ ప్రయోగాలూ చేపడతామని మోహన్‌రావు వివరించారు. అన్నీ సవ్యంగా సాగితే రెండుమూడేళ్లలో ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇతర కంటిజబ్బులతోపాటు, కేన్సర్ చికిత్సలకూ ఈ విధానాన్ని ఉపయోగించే అవకాశముందని తెలిపారు. అలాగే సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ మంజులారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలు ఏటికేడాది పెరిగిపోతున్న యాంటీబయాటిక్ మందుల నిరోధకతకు ఓ వినూత్నమైన విరుగుడును వెలుగులోకి తెచ్చాయని మోహన్‌రావు తెలిపారు.