ప్రజాసమస్యలు గాలికి
► సదుపాయాల కల్పనలో బల్దియా విఫలం
► వైఎస్సార్సీపీ జిల్లా డాక్టర్ నగేశ్
► మున్సిపల్ ఎదుట ధర్నా
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ మండిపడ్డారు. కనీస సదుపాయాలు కల్పించడంలో బల్దియా విఫలమైందన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గం విఫలమైందన్నారు. తలాపున మానేరు డ్యాం ఉన్నా తాగేందుకు సరిపడా నీరు ఇవ్వడం లేదని, పైపులైన్ లీకేజీలతో శివారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే లీకేజీలు అరికట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇంకా 9వేల నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, బీపీఎల్ కింద నిరుపేదలకు వెంటనే నల్లాలు మంజూరు చేయాలని కోరారు. అక్రమంగా ఏర్పాటు చేసిన 200 సెల్‌టవర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వీధిలైట్లు లేక నగరం అంధకారంగా మారిందని, యూజీడీ పనులు పూర్తిచేయడంతోపాటు రోడ్లను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సిరి రవి, యువత కార్యదర్శి దుబ్బాక సంపత్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ జావిద్, జిల్లా కార్యదర్శి మహ్మద్‌బేగ్, మైనార్టీసెల్ నగర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, నాయకులు ఎండీ ఫిరోజ్, రఘునా«థరెడ్డి, ఎండీ సాల్మన్, బొమ్మ సంతోష్‌గౌడ్, జిమ్ రాజు, వెంకటేశంగౌడ్, జాన్సన్ రొనాల్డ్, మోరె సుదర్శన్, ఆర్.నర్సయ్య, ఆర్.మనోజ్ తదితరులు పాల్గొన్నారు.