భూగర్భ చమురు నిల్వ కేంద్రం రెడీ
దేశంలోనే తొలికేంద్రం వైజాగ్ డాల్ఫిన్ కొండగర్భంలో సిద్ధం జూన్‌లో జాతికి అంకితం
ఐదు గుహల్లో పైపులైన్ల బిగింపు పూర్తి
1.33 మిలియన్ టన్నుల సామర్థ్యం..
రూ. 1037 కోట్ల పెట్టుబడి
విశాఖపట్నం: విశాఖపట్నం సిగలో మరో ప్రతిష్టాత్మకమైన భారీ జాతీయ స్థాయి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.1,037 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం వచ్చేనెలలోసగర్వంగా జాతికి అంకితం కానుంది. చమురు అవసరాలకు విదేశాలపై ఆధారపడడం తగ్గించి అత్యవసర సమయాల్లో నిరంతరాయంగా దేశ అవసరాలను తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో తలపెట్టిన భూగర్భ చమురు నిల్వ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. సముద్రతీరాన డాల్ఫిన్ కొండగర్భాన ఈ స్ట్రాటజిక్ క్రూడ్ స్టోరేజ్ కేవ్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి జూన్‌లో జాతికి అంకితం చేయనున్నారు. మన దేశం చమురు అవసరాలకు పూర్తిగా విదేశా లపైనే ఆధారపడి దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల భారం పెరిగిపోతుండడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటూ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, విపత్కర పరిస్థితుల్లో దిగుమతులు ఆగిపోయినా తట్టుకుని నిలబడేందుకు భారీగా చమురు నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిం చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడల్లా ఒకేసారి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి ఆరు నెలలపాటు దేశ అవసరాలకు సరిపడేలా భూగర్భంలో చమురు నిల్వ చేయాలని నిర్ణయించింది.
అలా రూపుదిద్దుకున్నదే స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కేవ్. ప్రణాళికలో భాగంగా దేశంలో మంగుళూరు (1.5 మిలియన్ టన్నులు), పాడూరు (2.5 మిలియన్ టన్నులు)తోపాటు రాష్ట్రంలో విశాఖపట్నంతో కలిపి మొత్తం మూడు కేంద్రాలను 2008లో ఎంపిక చేసింది. విశాఖలో 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నిల్వ కేంద్రానికి సురక్షిత ప్రాంతంగా డాల్ఫిన్ కొండను గుర్తించి 2011 నాటికి వినియోగంలోకి తేవాలని భావించారు. కానీ కొండగర్భాన సొరంగ మార్గంతోపాటు గుహలను తవ్వడం సవాల్‌గా మారింది. దీంతో 2009లో మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయి. తిరిగి రెండేళ్ల కిందట దిగుమతి చేసుకున్న రిగ్గులతో ఈ గుహలను వినియోగానికి వీలుగా సిద్ధం చేశారు. ఆసియాలోనే మొదటి భూగర్భ ఎల్పీజీ స్టోరేజీ ట్యాంకు.. ఈ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉండడంతో డ్రిల్లింగ్ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. సొరంగం కోసం ఆరు కిలోమీటర్ల మేర గుహను తవ్వుతుంటే భారీ రాళ్లు ఎగిరిపడి తవ్విన గుహ పూడిపోయేది. అత్యంత క్లిష్టపరిస్థితుల మధ్య సాగిన పనులు ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. ప్రాజెక్టులో భాగంగా చమురు నిల్వ కోసం ప్రస్తుతం కొండ అడుగుభాగాన ఆరుకిలోమీటర్ల పరిధిలో ఐదు గుహలు నిర్మించారు. వీటికి లోపలనుంచి ప్రత్యేక రక్షణ కవచాలు నిర్మించారు. వీటిలోనే చమురును నిల్వ చేసేలా ట్యాంకులు తయారుచేశారు. ఒక్కో ట్యాంకు 30 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల వెడల్పుతో సిద్ధమయ్యాయి. ఇందులో మూడు గుహలను ‘డబ్ల్యూ’ ఆకారంలో, మిగిలిన వాటిని ‘యు’ ఆకారంలో మార్చారు. ఈ ఐదు ట్యాంకుల చుట్టూ 75 మీటర్ల లోతులో ప్రత్యేక బోర్లు తవ్వి చమురు నిల్వ కేంద్రాలకు అనుసంధానించి అగ్నిప్రమాదాలు ఏవిధంగా ఎదుర్కోవాలనేదానిపై ఇటీవల ట్రయల్ కూడా నిర్వహించారు.
విదేశాల నుంచి వచ్చే నౌకలు నేరుగా ఈ ట్యాంకులకు ముడిచమురును పంపింగ్ చేసేలా విశాఖపట్నం పోర్టు, తూర్పు నావికాదళం నుంచి సేకరించిన 68 ఎకరాల్లో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్యాంకులకు, ఫిల్లింగ్ స్టేషన్‌కు మధ్య పైపుల పనితీరును నిపుణులు పరిశీలించి వినియోగానికి పచ్చజెండా ఊపారు. ఈ ట్యాంకులను హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం వీటిపనులు 95 శాతానికిపైగా పూర్తయ్యాయి. మలేసియా, నైజీరియా నుంచి వచ్చే ముడి చమురు నౌకల నుంచి ఫిల్లింగ్ స్టేషన్‌కు క్రూడ్‌ను పంప్ చేయడం, అక్కడినుంచి హెచ్‌పీసీఎల్‌కు పైపులైను ద్వారా తరలించడం వంటి పనులకోసం చేపట్టిన పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఐదు ట్యాంకులకు బిగించిన పైపులు, ఇతర యంత్రాల బిగింపు పనులు చివరి దశలో ఉన్నాయి.