ఈఎన్టీ కౌన్సెలింగ్
నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్ ఎక్కువగా చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి.
- నజీర్అహ్మద్, ఒంగోలు
వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్థభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దానివల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది.
డాక్టర్ ఈసీ వినయకుమార్
హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్
అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్