హెచ్ఓడీలంతా ఏం చేస్తున్నారు?
సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్
అనంతపురం మెడికల్:
‘రక్త పరీక్షలు చేయడం లేదని నా వద్దకొస్తారు.. స్కానింగ్ చేయడం లేదని చెబుతారు.. ఆపరేషన్ల విషయంలోనూ ఫిర్యాదులే.. వార్డుల్లో సరిగా చూడడం లేదని రోజూ గొడవ.. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే హెచ్ఓడీలంతా ఏం చేస్తున్నారు?’ అని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తన చాంబర్లో అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య సేవల కోసం రోగులు, వారి బంధువులు తన వరకు రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, అందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విభాగాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మందుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అల్ట్రాసౌండ్ సేవల విషయంలో వైద్యుల కొరత కారణంగా ఇన్పేషెంట్స్కు మాత్రమే చేయాలన్నారు.
మైక్రో బయాలజీ, పెథాలజీ విభాగాల కోసం ప్రత్యేక గదులు కేటాయించనున్నట్లు చెప్పారు. గతంలో మెడికల్ కళాశాలకు వెళ్లి పరీక్షలు చేయాల్సి వచ్చేదని, ఇక నుంచి ఆ సమస్య కూడా ఉండదన్నారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడం కోసం ‘మహాప్రస్థానం’ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ విషయం తెలిసేలా ప్రతి విభాగంలోనూ ప్రత్యేకంగా రాయించనున్నట్లు చెప్పారు. అనవసరంగా సీటీ స్కాన్ పరీక్షలు రాయొద్దని సూచించారు.
నాలుగు నెలల్లో ఎంఆర్ఐ కూడా వస్తుందని తెలియజేశారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో వచ్చే వారి కోసం త్వరలోనే ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల 100 మంచాలు, బెడ్లు వచ్చాయని, నూతన బిల్డింగ్లో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి అంటే ప్రజల్లో నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, హెచ్ఓడీలు డాక్టర్ నవీన్, డాక్టర్ నవీద్, డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివకుమార్, మేనేజర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.