సేవాభావంతో వైద్యవృత్తిలో రాణించగలరు
– వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బి.కే.నాయక్
బద్వేలు అర్బన్: వైద్య సేవలు అందించినంతమాత్రాన సరిపోదని వైద్యులు సేవాభావం ఉన్నప్పుడే వైద్య వృత్తిలో రాణించగలుగుతారని ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బికే.నాయక్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని లేబర్‌వార్డు, జనరల్‌వార్డు, ఐపీ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి మంజూరైన వార్మర్ (చిన్న పిల్లలను భద్రపరిచేయంత్రం)లు ఏసీ గదిలో ఉంచకుండా పక్కన ఉంచడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చి చి కొనుగోలు చేసిన యంత్రాలను నిరుపయోగంగా పడేసి ఏసీని మీరు ఉపయోగించుకుంటున్నారా అని మండిపడ్డారు. అలాగే నెలవారీ కాన్పుల సంఖ్య తక్కువగా ఉండడంతో గైనకాలజిస్ట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఐపీవార్డులో జ్వరం, విరేచనాలతో బాధపడుతున్న చిన్నారిని స్వయంగా పరిశీలించి జాగ్రత్తగా సేవలందించాలని కోరారు. అలాగే లేబర్‌వార్డులో ఉన్న గర్బిణీని కూడా పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. అలాగే మెడాల్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలలో సాధ్యమైనంత వరకు రోగులకు వీలైనన్ని పరీక్షలు చేయించాలని ఎందుకంటే ఒక్క పరీక్షకైనా ప్రభుత్వం రూ.230లు చెల్లిస్తుందని అలాంటపుడు పేదలకు మిగతా పరీక్షలుకూడా చేయించడం ద్వారా వారికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) డాక్టర్ పి.జయరాజన్ , ఏవో మహబూబ్‌ఖాన్, డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ ఎన్.మల్లేశ్వరి , గైనకాలజిస్ట్ డాక్టర్దుర్గా భవాణి, వైద్యాధికారి డాక్టర్ శిరీష, జనరల్ సర్జన్ డాక్టర్ గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.