Dr.Laxminarasimha
-
కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?
నా వయసు 42. గత రెండేళ్లుగా కడుపులో మంట, పుల్లని తేన్పులు, అజీర్ణం, అప్పుడప్పుడు కడుపుబ్బరం, గ్యాస్ లక్షణాలతో బాధపడుతున్నాను. హైపర్ అసిడిటీ అని చెప్పి డాక్టర్లు సూచించిన ఎన్నో మందులు వాడాను. కానీ ఫలితం కనపడలేదు. దీని సంపూర్ణ నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - కె. భానుప్రకాశ్, ఆదిలాబాద్ మీకు ఉన్న సమస్యను ఆయుర్వేదంలో ‘ఆమ్లపిత్తం’ వ్యాధిగా చెబుతారు. నియమ నిబంధనలకు భిన్నంగా ఆహారవిహారాలు జరిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురిచేసే వృత్తివ్యాపారాలు కూడా మరొక ముఖ్యకారణం. ఈ కింది సూచనలు పాటించండి. రెండుమూడు నెలల్లో మీకు గణనీయంగా సత్ఫలితం లభిస్తుంది. ఆహారం : అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానేయండి. తీపిపదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్సలాడ్స్ కూడా తీసుకోండి. భోజనంలో మసాలాలు లేని శాకాహారం మంచిది. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మొదలైనవాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. బయటి తినుబండారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, శీతలపానీయాల వంటివి అస్సలు పనికిరావు. అరటిపండ్లు మంచిది. విహారం : నియమతి వేళల్లో రాత్రిపూట నిద్ర అత్యంతావశ్యకం. జాగరణ చేయవద్దు. ధూమపాన, మద్యపానాల వంటి అలవాట్లు వ్యాధిని మరింత ఉద్ధృతం చేస్తాయి. దుఃఖం, చింత, శోకం, భయం వంటి ఉద్వేగాలను దూరంచేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వ్యాయామం వల్ల... ముఖ్యంగా ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మీ సమస్య కుదుటపడుతుంది. మందులు లఘుసూతశేఖరరస (మాత్రలు) :ఉదయం 2, రాత్రి 2 అవిపత్తికర చూర్ణం : మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో) శూక్తిన్ (మాత్రలు ) : ఉదయం 1, రాత్రి 1 గమనిక... అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది. మా పాప వయసు 5 నెలలు. గత పది రోజులుగా పాపకి మలమార్గం చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా కమిలిపోయినట్లు, ఒరిసినట్లుగా ఉంది. తాకితే పాప ఏడుస్తోంది. పరిష్కారం సూచించండి. - ఎమ్. నిర్మలమ్మ, తణుకు శిశువు విసర్జించిన మలం ఎక్కువసేపు ఆ ప్రాంతానికి తగులుతూ ఉంటే, అక్కడి చర్మం ఆ విధంగా తయారవుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘గుదకుట్ట లేదా అహిపూతనా’ అనే పేర్లతో వివరించారు. మలమూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే అలవాటు మంచిది. శిశువు పక్కబట్టలను ఎప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపువేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి, అనంతరం ‘మహామరిచాదితైల’ అనే మందును దూదితో ముంచి, ఒరిసిన చర్మం మీద నాజూగ్గా రాయాలి. ఇది బయటి పూతకు మాత్రమే. ‘అరవిందాసవ’ అనే ద్రావకాన్ని అర చెంచా ఉదయం, అరచెంచా రాత్రి తేనెతో శిశువుకు తాగించండి. దీనివల్ల చంటిపిల్లలకు అరుగుదల, బలం చక్కగా ప్రాప్తిస్తాయి. ఎన్నో వ్యాధులకు నివారకంగా కూడా పనిచేస్తుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
కండ్లకలక తగ్గడం ఎలా...?
నా వయసు 55. ప్రతి ఏడాదీ శీతకాలంలో నాకు కండ్లకలక వస్తుంటుంది. పుసులు కట్టి కండ్లు అంటుకోవడం, ఎర్రబడటం, సూర్యరశ్మి చూడలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. దీని నిర్మూలనకు ఆయుర్వేద సూచనలు ఇవ్వండి. పి. రాధాస్వామి, చిత్తూరు కండ్లకలక (కంజెక్టివైటిస్)ను ఆయుర్వేదం ‘అభిష్మంద’ వ్యాధిగా వర్ణించింది. దోష ప్రాబల్యాన్ని బట్టి ఇది ‘వాత, పిత్త, కఫ, రక్త’ భేదాలుగా వర్గీకృతమైంది. వైరస్, బాక్టీరియా వంటి సూకా్ష్మంగ క్రిములు, అలర్జీ (అసాత్మ్యత) దీనికి ప్రధాన కారణాలు. ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి. సాధ్యమైనంత వరకు కంటిని అపరిశుభ్ర వాతావరణానికి దూరంగా ఉంచాలి. చేతివేళ్లతో కళ్లు నులుపుకోవడం వంటివి చేయకూడదు. ప్రతివ్యక్తికి ఉండే క్షమత్వశక్తినీ, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను బట్టి ఈ వ్యాధి సోకడమనేది ఆధారపడి ఉంటుంది. ఈ రోగం ఉన్న వ్యక్తులకు కాస్త దూరంగా మెలగాలి. శుభ్రభస్మం (ఏలం/పటిక) నీళ్లలో మరగబెట్టి, చల్లార్చి, పరిశుభ్రంగా పదిలపరచుకొని, రెండేసి చుక్కలు రెండు కళ్లలోనూ వేసుకోవాలి. ఇది కంటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. అభిష్యందవ్యాధి ఉన్న రోగులు, గోరువెచ్చని నీళ్లతో కండ్లను శుభ్రపరచుకొని మెత్తటి, శుభ్రమైన రుమాలుతో తుడుచుకోవాలి. ‘ఆఫ్తాకేర్, ఐటోన్’ వంటి ఆయుర్వేద కంటిచుక్కలు మందుల షాపుల్లో లభిస్తాయి. రెండేసి చుక్కల చొప్పులన రెండు కళ్లలోనూ మూడుపూటలా వాడాలి. ‘గంధకరసాయన మరియు లఘుసూతశేఖర రస’ మాత్రలను పూటకు రెండేసి చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తక్కువగా తీసుకుంటూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. నా వయసు 62. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. డాక్టర్లు పరీక్ష చేసి షుగరు వ్యాధి లేదన్నారు. కానీ ప్రోస్టేట్ గ్రంధి వాపు వల్ల ఈ సమస్య కలిగిందన్నారు. ఇది తగ్గడానికి మందులు తెలియజేయ ప్రార్థన. - ఆర్. బసవలింగం, అనంతపురం ప్రోస్టేట్ గ్లాండ్ను ఆయుర్వేద పరిభాషలో ‘పౌరుషగ్రంధి’ అంటారు. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది కొద్దిగా పరిమాణం పెరగడం సహజం. దానివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్రం మాటిమాటికీ వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రంధికి ఇన్ఫెక్షనూ సోకవచ్చు. కొందరిలో ఈ వాపు క్యాన్సరుగా పరిణమించవచ్చు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ దిగువ సూచించిన మందుల్ని రెండు నెలల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. సప్తవింశతి గుగ్గులు (మాత్రలు) --- ఉదయం 2, రాత్రి 2 చంద్రప్రభావటి (మాత్రలు) --- ఉదయం 2, రాత్రి 2 చందనాసవ (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి. నా వయసు 23. తరచూ తలలో పేలు బాధిస్తున్నాయి. దీనికి మందు చెప్పండి. - కె. అంజనీబాయి, కరీంనగర్ శిరోజాలలో మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంటే తలకు పేలుపట్టే పరిస్థితి రాదు. ప్రతిరాత్రి ‘నింబతైలం’ (వేపనూనె) తలకు రాసుకుని, మరుసటిదినం కుంకుడుకాయ చూర్ణంతో తలస్నానం చేయండి. సీతాఫలాల్లోని గింజల్ని ఎండబెట్టి, పొడిచేసి, ఆ చూర్ణాన్ని నీళ్లలో ముద్దగా చేసి రోజు విడిచి రోజు శిరోజాలకు పట్టించండి. పదిరోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ‘కుమార్యాసవ’ ద్రావకాన్ని ఉదయం, రాత్రి నాలుగేసి చెంచాలు... సమానంగా నీళ్లు కలిపి ఒక నెలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్