ఆర్థిక వ్యవస్థ నత్తనడకే..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదని, రికవరీ సంకేతాలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఒక నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల రాక మళ్లీ మొదలైందన్న సంకేతాలు వస్తేనే ఎకానమీ పూర్తిగా కోలుకోగలదని తెలిపింది. రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మళ్లీ 8 శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదపడగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో అసోచాం నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రెండు డజన్ల మేర పారిశ్రామిక విభాగాల్లో ఉత్పత్తి పడిపోయింది. డిమాండ్ మళ్లీ పెరిగితే తప్ప పెట్టుబడులు రావడం కష్టమని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. యంత్రపరికరాల రంగం కోలుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కీలకమైన తయారీ రంగంలో పెట్టుబడుల పరిస్థితికి కొలమానంగా నిల్చే యంత్రపరికరాల రంగం ఇంకా కష్టకాలంలోనే ఉందని వివరించారు. డిమాండ్ మందగించడాన్ని ఇది సూచిస్తుందన్నారు.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో యంత్రపరికరాల విభాగం 0.7 శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 14.2 శాతం ప్రతికూల వృద్ధి కనపర్చింది. ఇలాంటి పరిస్థితి చాలా ఆందోళనకరమైనదని అసోచాం పేర్కొంది. ఈ రంగంలో ఇప్పటికే భారీ నిల్వలు పేరుకుపోయాయని వివరించింది. ఈ నిల్వలు పూర్తిగా వినియోగమై, సానుకూల పరిస్థితులు ఏర్పడి కొత్త పెట్టుబడులు రావాలంటే మరికాస్త సమయం పడుతుందని పేర్కొంది.
రికవరీ సంకేతాలను పక్కనపెడితే హాట్రోల్డ్ స్టీల్, చక్కెర పరిశ్రమలకు ఉపయోగపడే యంత్రపరికరాల ఉత్పత్తి సెప్టెంబర్లో గణనీయంగా తగ్గిందని అసోచాం నివేదిక వివరించింది. ఇక కలర్ టీవీల అమ్మకాలు 30 శాతం పడిపోగా, వాణిజ్య వాహనాల విక్రయాలు 28.5 శాతం క్షీణించాయి. ఇటువంటి పరిస్థితుల్లో.. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యయాలను తగ్గించుకోనుండటం మరింత ఆందోళనకరమైన సంకేతాలు పంపుతోందని నివేదిక వ్యాఖ్యానించింది. ద్రవ్యలోటును కట్టడి చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అత్యధికంగా సేవలు, వస్తువులను కొనుగోలు చేసే ప్రభుత్వం వ్యయాలు తగ్గించేయడం వల్ల వ్యాపార పరిస్థితులు మరింత దెబ్బతింటాయని తెలిపింది.