పులితో కుక్క ఫైట్...
షాజహాన్ పూర్: యజమానికి విధేయతను ఎల్లప్పుడూ చాటుకుంటూ ఉండే జీవి కుక్క. నిద్రపోతున్న యజమానిని కాపాడటానికి ఏకంగా పులితో పోరాడి ఓ కుక్క ప్రాణాలు వదిలింది. ఉత్తరప్రదేశ్ లోని దుద్వా జాతీయ పార్కు సమీపంలోని బార్బాత్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని గురుదేవ్ సింగ్ తన కుక్కతో పాటు ఇంటి బయట పడుకున్నాడు. అర్ధరాత్రి అలికిడి విని దక్షిణ ఖేరి అడవి నుంచి వస్తున్న పులిని చూసిన జాకీ(కుక్క) యజమానిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. గాఢమైన నిద్రలో ఉన్న సింగ్ ఏం జరుగుతుందో గమనించే లోపే పులి అతని మీద దాడికి దిగింది. దీంతో జాకీ ఒక్క ఉదుటున పులి మీదకు దూకి యజమానికి కాపాడటానికి ప్రయత్నించింది. పులి తిరిగి దాడి చేసి జాకీను అడవిలోకి లాక్కుని వెళ్లిపోయింది.
విషయం తెలుసుకున్న సింగ్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని జాకీ కోసం ఆ ప్రాంతాన్నంతా తీవ్రంగా గాలించారు. సాయంకాల సమయంలో అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన జాకీకి అంత్యక్రియలు నిర్వహించారు. జాకీ తల్లి ఒక వీధి కుక్క అని, తన పిల్లలు సుప్రీత్, గుల్షన్ ప్రీత్ లు చిన్నప్పుడే దాన్ని తీసుకువచ్చారని సింగ్ తెలిపారు. పిల్లలతో పాటు వారి వెనుకే స్కూల్ కి వెళ్లేదనీ, గుల్షన్ జాకీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. అరణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, అప్పుడప్పుడు ఆహారం కోసం జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎన్ యాదవ్ తెలిపారు.