‘డుంఢి’ నిషేధంపై వెనక్కు తగ్గకండి
సాక్షి, బెంగళూరు: ‘డుంఢి’ పుస్తక నిషేధంపై ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిదానందమూర్తి ప్రభుత్వానికి సూచించారు. గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రచయిత యోగీష్ మాస్టర్ తన ‘డుంఢి’ పుస్తకంలో వినాయకుడిని అవమానించే రీతిలో అనేక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వినాయకుడు హిందువులకు ఆరాధ్య దైవమని, సకల విఘ్నాలను తొలగించే మూషిక వాహనుడి గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు. అందుకే ఈ పుస్తకం నిషేధ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని కోరారు. ఈ తరహా పుస్తకాల రచన, ముద్రణ విషయాలకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే విధి విధానాలను రూపొందించాలని కోరారు.
అంతేకాక హిందూ దేవతలను అవమానిస్తూ, ధార్మిక భావాలను దెబ్బతీసే విధంగా పుస్తకాలు రచించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక చట్టాన్ని సైతం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.