ప్రాణాలతో చెలగాటం
- జిల్లాలో నకిలీ వైద్యుల దందా
- ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు
- టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా యాంటిబయాటిక్
- ఎమ్మిగనూరులో పట్టుబడిన ఆర్ఎంపీ
కర్నూలు(హాస్పిటల్): ప్రజల అమాయకత్వమే వారికి పెట్టుబడి. కాస్త మాటలు నేరిస్తే చాలు ఎలాగైనా జీవించవచ్చనేది వారి తెలివి. జనాన్ని మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. నొప్పి నివారణ మందులను ఆయుర్వేద మందులతో కలిపి అంటగడుతున్నారు. యాంటిబయాటిక్ మందునే టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా చూపించి జనాన్ని బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులు జిల్లా అంతటా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నొప్పి, బాధ.. సత్వరమే పోవాలనే జనం ఆకాంక్షను వారు సొమ్ము చేసుకుంటున్నారు. అధికశాతంలో నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్ కలిపిన మందులు ఇచ్చి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
నకిలీ మందులు ఇలా అంటగట్టారు..
ఎమ్మిగనూరులో నగేష్ అనే ఆర్ఎంపీ.. జెంటామైసిన్ అనే యాంటిబయాటిక్ ఇంజెక్షన్లను భారీ ఎత్తున కొనుగోలు చేశాడు. వాటిని నీళ్ల బకెట్లో వేసి కొద్దిసేపు ఉంచుతాడు. కొంతసేపటికి ఇంజెక్షన్ వాయిల్‌కు ఉన్న లేబుళ్లు ఊడిపోతాయి. ఊడిపోయిన లేబుళ్ల స్థానంలో అప్పటికే ముద్రించిన టైఫాయిడ్ వ్యాక్సిన్ లేబుళ్లను అతికిస్తున్నారు. సాధారణంగా జెంటామైసిన్ ఇంజెక్షన్ ఎంఆర్పీ రూ.5లు ఉంటుంది. ఇదే ఇంజెక్షన్‌ను టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా చూపించి రూ.550లకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కలుషిత నీటి వల్ల టైఫాయిడ్ వ్యాధి వస్తుందని భయపెట్టి, అది రాకుండా ఉండాలంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం చేసుకున్నారు. రూ.550 ఎంఆర్పీ ఉన్న వ్యాక్సిన్‌ను రూ.300ల నుంచి రూ.400లకు తగ్గించి అమ్ముతున్నట్లు జనాన్ని నమ్మించారు. దీంతో జనం అతని మాటలు నమ్మి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. రెండేళ్లుగా ఎమ్మిగనూరు చుట్టు పక్కల గ్రామాల్లో అధిక మొత్తంలో ప్రజలు ఈ వ్యాక్సిన్‌ను వేయించుకుని మోసపోయారు. తక్కువ స్థాయిగల జెంటామైసిన్ ఇంజెక్షన్‌ను వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా రూ.5ల విలువ చేసే మందును టైఫాయిడ్ వ్యాక్సిన్ పేరుతో రూ.300ల నుంచి రూ.400లకు విక్రయించి మోసం చేయడం దారుణం. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించి శనివారం.. అతన్ని పోలీసులకు అప్పగించారు.
నకిలీ ఆయుర్వేద మందులతో...
కర్నూలు నగర శివారులోని శిల్పాసింగపూర్ ఎస్టేట్స్ సమీపంలో మూడు నెలల క్రితం శ్రీనివాసులు అనే వ్యక్తి ఆయుర్వేద మందులను అల్లోపతి మందులతో తయారు చేసి విక్రయించేవాడు. షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులు తమ ఆయుర్వేద మందులతో నయం అవుతాయని జనాన్ని నమ్మించాడు. ఈ మేరకు భారీగా పారాసిటమాల్, డైక్లోఫెనాక్, స్టెరాయిడ్ మాత్రలను కొనుగోలు చేసి, వాటిని ఆయుర్వేద పొడుల్లో కలిపి, వాటిని చిన్న చిన్న గోళీలుగా తయారు చేసి జనానికి విక్రయించేవాడు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కొన్నాళ్లకే అతను బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ అతని ఆయుర్వేద మందుల్లో అల్లోపతి మందులు కలిపారని నిర్ధారణ అయినట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయనపై తిరిగి కేసు ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వీకర్‌సెక్షన్ కాలనీలోనూ ఓ వ్యక్తి ఇదే విధంగా ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు కలిపి ప్రజలకు అమ్మేవాడు. అతన్ని సైతం విజిలెన్స్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తెలిసీ తెలియని వైద్యం..
పేద, గ్రామీణ ప్రజల నిరక్షరాస్యతను పెట్టుబడిగా చేసుకుని కొందరు నకిలీ వైద్యులు, ఆర్ఎంపీలు ప్రజలకు నకిలీ మందులను అంటగడుతున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ, డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ వైద్యులు తిష్టవేశారు. వైద్యం చేయడానికి ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఆపరేషన్లు సైతం చేస్తునఆనరు. గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగి కల్లూరు ప్రాంతంలో ఏకంగా ప్రసవాలు, ఆపరేషన్లు సైతం నిర్వహించారు. జిల్లాలో అనేక మంది ఆర్ఎంపీలు జనరిక్, పీడీ కంపెనీల మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు జనానికి అంటగడుతున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ఇష్టమొచ్చినట్లు మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
నకిలీ మందులు అమ్మితే పదేళ్ల జైలు
–చంద్రశేఖర్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ
నకిలీ మందులు అమ్మితే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జిల్లాలో ఇప్పటి దాకా మద్దిలేటి, జనార్దనాచారి, శ్రీనివాసులు, నగేష్‌తో పాటు మరొకరిపై కేసులు నమోదు చేశాం. ఇకపై ఆర్ఎంపీలపై నిఘా పెడతాం. వారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తాం. ప్రజలు సైతం ఇష్టానుసారంగా నకిలీ వైద్యులు, ఆర్ఎంపీల వద్దకు వెళ్లకూడదు. అర్హులైన వైద్యుల వద్దే చికిత్స చేయించుకోవాలి.