డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
బెంగళూర్: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్ కు తన తొలి మ్యాచ్ లో చుక్కెదురైంది. డేవిస్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసింది. సెర్బియా స్టార్ ఆటగాడు దుసాన్ లాజోవిచ్ 6-3,6-2,7-5 తేడాతో భారత క్రీడాకారుడు యుకీ బాంబ్రీని మట్టికరిపించాడు. దీంతో డేవిస్ కప్ లో సెర్బియా తొలి విజయాన్ని నమోద చేసింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శుక్రవారం ఆరంభమైన ఈ పోరులో యుకీ బాంబ్రీ తీవ్ర ఒత్తిడితో ఆటను కొనసాగించాడు. వరుస సెట్లను కోల్పోయి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమై ఓటమి చవిచూసింది.
2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది.