మార్కెట్లలో అక్రమాలకు ఈ- బిడ్డింగ్‌తో చెక్
హైదరాబాద్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డీడీ మల్లేశం
తాండూరు : మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను పారదర్శకంగా నిర్వహించడానికి త్వరలోనే ఈ- బిడ్డింగ్, ట్రేడింగ్ విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్లో జీరో వ్యాపారం, అక్రమాలకు ఈ- బిడ్డింగ్ ద్వారా చెక్ పెట్టవచ్చన్నారు. మొదటి దశలో మిర్యాలగూడ, కే సముద్రం, నిజామాబాద్‌లో ఈ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు.
రెండో దశలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, బాదేపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, మద్నూర్, సిద్దిపేట, సదాశివపేట, జహీరాబాద్, పరిగి, వికారాబాద్, తాండూరు, హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, గడ్డిఅన్నారం మార్కెట్‌యార్డులో ఈ విధానం అమలుకు ప్రతిపాదనలు చేశామన్నారు. రైతులు ఆహార ఉత్పత్తులను యార్డుకు తీసుకొచ్చి ఎవరికి విక్రయించారు, తూకం, ధర వంటివి కంప్యూటర్లో రికార్డు అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 89 కేంద్రాల ద్వారా ఉల్లిని విక్రయిస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటికి 10,274 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేశామని, దీంతో ప్రభుత్వంపై రూ.2.25 కోట్ల భారం పడిందని చెప్పారు. నాసిక్, కర్నూలు నుంచి ఉల్లి కొనుగోలుకు 3 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 32 మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. మహేశ్వరం, కుల్కచర్ల, కోట్‌పల్లి, బషీరాబాద్, గుడిమల్కాపూర్‌లో కొత్త మార్కెట్లు ఏర్పాటు కానున్నాయన్నారు. మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. మార్కెట్లో పత్తి అమ్మిన రైతులకు నేరుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లించే విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు.