పోలీసు ఈ-మెయిళ్లపై హ్యాకర్ల గురి!
హ్యాకింగ్ ప్రమాదంపై నిఘా వర్గాల హెచ్చరిక
అప్రమత్తత జారీ చేసిన డీజీపీ కార్యాలయం
పాస్‌వర్డ్స్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: పోలీసు అధికారుల ఈ-మెయిల్ అకౌంట్లు హ్యాకర్లు గురిపెట్టారంటూ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే కొందరి అకౌంట్ల హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయంటూ తెలిపాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులందరికీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల మొదటి వారంలో ప్రభుత్వ వెబ్సైట్లు చొరబాటుకు గురైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశాకు చెందిన 22 వెబ్సైట్లపై పాకిస్థాన్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్న హ్యాకర్లు దాడి చేశారు. ప్రతి వెబ్‌పేజ్ మీదా ‘సమాచారం డిలీట్ చేయలేదు. తస్కరించలేదు. ఇది భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఓ సందేశం మాత్రమే’ అని హ్యాకర్లు రాశారు. ఇప్పుడు హ్యాకర్ల కన్ను పోలీసు అధికారులు, ఇతర ప్రముఖుల ఈ-మెయిల్ అకౌంట్లపై ఉన్నట్లు నిఘావర్గాలు గుర్తిం చాయి.
హ్యాకింగ్ ద్వారా అత్యంత కీలకమైన, ర హస్య సమాచారాన్ని తస్కరించడానికి ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నట్లు నిర్ధారించారు. పబ్లిక్ డొమైన్స్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా పోలీ సు అధికారులకు చెందిన ఈ-మెయిల్ అడ్రస్ల్ని సేకరించిన ముష్కరులు హ్యాకింగ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘావర్గాలు చెప్తున్నాయి. సబ్జెక్ట్, కంటెంట్ లేకుండా వచ్చే ఈ-మెయిల్స్‌ను అనుమానించాల్సిందిగా ఐపీఎస్ అధికారులకు డీజీపీ కార్యాలయం సూచించింది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దని, తక్షణం డిలీట్ చేయాలని స్పష్టం చేసింది. పరిచయస్థుల ఐడీల నుంచి వచ్చినట్లు కనిపించినా... వారితో మాట్లాడి నిర్థారించుకునే వరకు ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. కొందరు హ్యాకర్లు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్‌పేజ్‌ల లింకుల్ని ఈ-మెయిల్ ఐడీలకు పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే సైన్‌ఔట్ అయినట్లు కనిపించి మరోసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుందని డీజీపీ కార్యాలయం తన సూచనల్లో పేర్కొంది. అలా చేస్తే పాస్వర్డ్ తేలిగ్గా హ్యాకర్లకు చేరిపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో అధికారులు వీలున్నంత వరకు పాస్వర్డ్ మార్చుకోవాలని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.