ఆధార్ సీడింగ్‌లో దేశంలో ‘తూర్పు’ ప్రథమం
సాక్షి, కాకినాడ :జిల్లాలో ఉన్న 8,71,774 వంట గ్యాస్ కనెక్షన్లలో 7,37,973 కనె క్షన్లకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయడం ద్వారా దేశంలోనే తూర్పుగోదావరి ప్రథమ స్థానంలో నిలిచిందని జాయింట్ కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అన్నారు. ఇక బ్యాంకు సీడిం గ్ సం బంధించి 5,58,224 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తి చేయడం ద్వారా దేశంలోనే రెండో స్థానంలో నిలిచామన్నారు. వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానిత సమస్యలపై ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు.పలువురు వినియోగదారులు ఆధార్ అనుసంధానిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
జేసీ మాట్లాడుతూ గ్యాస్‌కు ఆధార్‌తో అనుసంధానిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ కింద గ్యాస్ సబ్సిడీ అందించేందుకు కేంద్రం విధించిన గడువు శనివారంతో ముగిసిందన్నారు. ఇప్పటి వరకు ఆధార్ సీడిం గ్ చేసుకున్న వారికి ఆదివారం నుంచి సబ్సిడీ వర్తిస్తుందన్నారు. మరో లక్షా 79 వేల మంది వినియోగదారులు వెంటనే వారి ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో సీడింగ్ చేసుకోవాలన్నారు. రాజమండ్రి నుంచి ఒక వినియోగదారుడు ఫోన్ చేసి తనకు రెండు పర్యాయాల నుంచి గ్యాస్ సబ్సిడీ రావడం లేదని చెప్పగా జేసీ స్పందించి అప్పటికప్పుడే ఆన్లైన్లో పరి శీలించారు.
ఆధార్ సీడింగ్ జరిగిందని, కానీ సబ్సిడీ ఎందుకు రావడం లేదో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 35
మంది వినియోగదారులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. సమస్యల పరిష్కారానికి సోమవారం నుంచి పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో 0884-6454341 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సెలవు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది పనిచేస్తుంద న్నారు.