నాసిరకంగా ఏలేరు ఆధునికీకరణ
పిఠాపురం రూరల్ :
ప్రస్తుతం చే స్తున్న ఏలేరు ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపించిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు విమర్శించారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, ఎల్ఎన్ పురం గ్రామాల్లోని పంట కాలువలను శనివారం ఆయన పరిశీలించారు. ఏలేరు కాలువలపై నిర్మిస్తున్న రెగ్యులేటర్ నిర్మాణాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలేరు రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్ల వ్యయంతో చేపట్టే ఆధునికీకరణ పనులకు 2008లో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు మందకొడిగా జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం చేపట్టిన చిన్నపాటి పనుల్లోనే భారీ అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు. ఏలేరు ఆయకట్టు రైతుల దుస్థితిపై ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటిని తీసుకురావడం చేతకాక ఫైరింజన్లతో పొలాలకు నీరు అందిస్తామంటూ నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ఆధునికీకరణ పనులను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. ఏలేరు శివారు ఆయకట్టు భూములు ఎండిపోకుండా నీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నేతలు కురుమళ్ల రాంబాబు, గండేపల్లి బాబి, కర్రి ప్రసాద్ తదితరులున్నారు.