జై జై గణేశా
సాక్షి, ఏలూరు :తొలిపూజలు అందుకునే వినాయకుడి చవితి ఉత్సవాలకు జిల్లా ముస్తాబైంది. ఊరూరా ఏకదంతుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తోంది. భాద్రపద శుద్ధ చవితి నుంచి చతుర్దశి వరకు వరకూ వినాయక నవరాత్ర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు భారీ ఏర్పాట్లు చేశాయి. పాలకొల్లు రెల్లిపేటలో రెల్లి యువజన సంఘం ఆధ్యర్యంలో 52 అడుగుల గణేష్ విగ్రహం నెలకొల్పారు. ఏలూరు గణేష్ చౌరస్తా (కుండీ సెంటర్)లో శ్రీ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 27 అడుగుల భారీ వినాయక విగ్రహం కొలువైంది. రామకోటి మైదానం, ఎన్ఎస్ మార్కెట్ (కూరగాయాల మార్కెట్)లలో 20 అడుగులకు పైగా ఉండే భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. రూ.1.20 లక్షల్ని వెచ్చించి హైదరాబాద్లో కొనుగోలు చేసిన 15 అడుగుల ప్రత్యేక విగ్రహాన్ని తణుకు పాత పోలీస్స్టేషన్ వీధిలో ఏర్పాటు చేశారు.
వేల్పూరులో గణపతి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. 9 రోజుల పాటు నిర్వహించే ఇక్కడి ఉత్సవాలు జాతరను తలపిస్తుంటాయి. పౌరాణిక వేషధారణలు, కర్రసాము ఇక్కడి ప్రత్యేకత. జంగారెడ్డిగూడెం కొత్తబస్టాండ్ సెంటర్లో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటై 26ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా 26 అడుగుల మట్టి గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డులో దాదాపు 20 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. మ్యూజికల్ నైట్, డాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. చాగల్లులో సుమారు 58 ఏళ్లుగా చేస్తున్న ఉత్సవాలకు ఈ ఏడాది కూడా తెలగ సంఘం, వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సినీ దర్శకుడు వీవీ వినాయక్, సాయిశ్రీనివాస్ (అల్లుడు శ్రీను హీరో), నిర్మాతలు వీవీ దానయ్య, బెల్లంకొండ సురేష్, గాయని గీతామాధురి, సినీ, రంగస్థల కళాకారులు ఇక్కడికి తరలిరానున్నారు. నరసాపురం అంకాలవారిపాలెం యూత్ ఆధ్వర్యంలో 20 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. నిడదవోలు పాటిమీద 15అడుగుల విగ్రహాన్ని గణేష్ ఆలయ కమిటీ ఏర్పాటుచేస్తోంది. పౌరాణిక నాటకాలు, జానపద నృత్యాలు, మ్యూజికల్ నైట్, కోలాటం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గణేష్ విగ్రహాల ధరలు భారీగా పెరిగారుు. ఓ మోస్తరు విగ్రహానికే కనీసం రూ.5 వేలు వెచ్చించాల్సి వచ్చింది. మట్టి వినాయక ప్రతిమలు వినియోగించాల్సిందిగా విద్యార్థులు, స్వచ్ఛంద, వాణిజ్య సంస్థలు అవగాహన కల్పించడంతోపాటు విగ్రహాలను పంపిణీ చేశారు.