employ guarantee scheme
-
‘కూలీ’న బతుకులు
వంద రోజులు పని దినాలు కల్పించాలని ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. జిల్లాలో ఇప్పటికే కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఉపాధి పనితోనైనా.. నాలుగు మెతుకులు తిందామంటే ఆ పనులు కూడా అందరికీ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. లక్షలాది మంది కూలీలు ఉండగా వేలాదిమంది కూలీలకే పనులు కల్పిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక జిల్లా కూలీలు వలసబాట పడుతున్నారు. మెదక్ : జిల్లాలో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. వెరసి వ్యవసాయం మూలన పడింది. కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసల నివారణకు తోడ్పడాల్సిన ఉపాధిశాఖ అధికారులు పల్లెలో కేవలం నర్సరీల ఏర్పాటుతోనే సరిపెడుతున్నారు. జిలాలో 7,68,271 మంది జనాభా ఉన్నారు. 1,81,342 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,05,104 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరందరికీ ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించాల్సి ఉండగా 80శాతం గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదు. కానీ మెజార్టీ గ్రామ పంచాయతీలు నర్సరీల్లో మొక్కలను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. మొక్కలను పెంచేందుకు కేవలం 10 మంది కూలీలకు మించి ఉపాధి దొరకడం లేదు. దీంతో పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. 10 వేల మందికి మాత్రమే.. 320 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామం పరిధిలో వన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,05,104 మంది కూలీలు ఉండగా సుమారు 10,955 మంది కూలీలకు మాత్రమే ఈ నర్సరీల ఏర్పాటులో పని దొరకుతోంది. ఈ లెక్కన 3,94,149 మందికి పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఉన్న ఊళ్లో పనులు దొరక్క పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు పని చేస్తున్నారు. అదనపు భత్యం మాటే లేదు.. ఉపాధి కూలీలకు వేసవికాలంలో ప్రతి ఏటా ఐదు నెలల పాటు అదనపు భత్యం అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 నుంచి 30 శాతం అదనంగా కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే కానరావడం లేదు. వారం రోజులుగా జిలాల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పనులు చేసే అతికొద్ది మంది కూలీలకు సైతం ఆ భత్యం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పస్తులుంటున్నాం.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేక పోవడం, ఎండలు ప్రారంభం కావడంతో ఆ రెండు బోర్లు నీళ్లు పోయడం లేవు. ఉపాధి హామీలో ఇచ్చే కరువు పనులు చేద్దామంటే మా గ్రామంలో ఇప్పటికి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. సార్లను అడిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇక పట్నం బతుకుదెరవు పోయేందుకు సిద్ధమౌతున్నం. –జాల దుర్గయ్య , పాతూర్ జనాభా 7,68,271 జాబ్ కార్డులు 1,81,342 కూలీలు 4,05,104 పని చేస్తున్న కూలీలు 10,955(సుమారు) -
హరితహారం చెట్లపై హక్కు వారిదే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల్లో హరితహారం కింద నాటిన ఉద్యాన చెట్లపై భూములు లేని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర బడుగు వర్గాలకు హక్కు కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ స్థలాలు, సామాజిక భూములు తదితర చోట్ల అటవీకరణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో హరితహారం కింద మొక్కలు నాటుతోంది. వీటిపై పట్టా ఇచ్చి.. వచ్చే పండ్లు, కలప తదితర ఫలాలను అనుభవించేందుకు ఈ అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని ఉపాధిహామీ కింద అమలుచేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అన్ని ప్రభుత్వ భూములను ఈ పథకం కింద నిర్ణీత వర్గాలకు చెందిన పేదలకు చెట్లపై పట్టా అందజేస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు.. రోడ్లు, కాలువ పక్కన భూములు, ఇతర బీడు భూముల్లోని చెట్లపై సర్కార్ ఈ పథకం కింద లబ్ధిదారులకు పట్టా ఇవ్వనుంది. చెట్లపై పట్టా పొందాలంటే ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 రోజులు గతేడాది లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసి ఉండాలి. లబ్ధిదారులను ఉపాధిహామీ పథకం సిబ్బంది గుర్తిస్తారు. అందుబాటులో ఉన్న భూమిని గుర్తించి లబ్ధిదారులకు వాటిని కేటాయించే బాధ్యత తీసుకుంటారు. లబ్ధిదారులు, భూముల గుర్తింపును గ్రామసభలో పెట్టి ఆమోదం తీసుకోవాలి. అనంతరం భూములు, లబ్ధిదారుల జాబితా తయారుచేస్తారు. ప్రతి ఏడాది మే నెలలో ఈ ప్రక్రియ కింద లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. -
ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై విచారణ
ఉప్పునుంతల: మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ ఉపాధిహామీ పథకం కూలీల వేతనం బిల్లులపై డ్వామా ఫైనాన్స్ మేనేజర్ ఫయాజ్ పాషా, డీబీటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఏపీడీ పాపయ్యలు బుధవారం స్థానిక కార్యాలయంలో విచారణ చేశారు. కూలీలకు సంబంధించిన మస్టర్లు, ఎఫ్టీఓలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఇటీవల జరిగిన ఏడో విడత సామాజిక తనిఖీలో మండలంలో కూలీలకు సంబంధించి రూ. 14 లక్షల వేతనం బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించామని క్లస్టర్ ఏపీడీ పాపయ్య తెలిపారు. ఈజీఎస్ ఏపీఓ సాయిశంకర్ అక్రమంగా డ్రా చేసిన రూ. 26 లక్షలు తిరిగి రికవరీ చేశామన్నారు. వాటిలో కూలీలకు అందాల్సిన బిల్లులపై విచారణ చేసి అందించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు. సీఆర్డీ నుంచి అందిన ఆదేశాలమేరకు మొదట పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏస్థాయిలో నిలిచిపోయావనే అంశాలపై రికార్డుల పరంగా విచారణ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నేరుగా కూలీలతో మాట్లాడి వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని డబ్బులను పంపిణీ చేయనున్నామని ఏపీడీ తెలిపారు.