ప్రైవేటు దందా!
- అసిస్టెంట్లదే హవా
-ప్రతి ఉద్యోగికీ అనధికార సిబ్బంది
- చక్రం తిప్పుతున్న ప్రైవేటు వ్యక్తులు
నెల్లూరు (దర్గామిట్ట): రవాణశాఖ కార్యాలయంలో ఎలాంటి పని కావాలన్నా వాహనదారులకు తడిసిమోపెడు ఖర్చు అవుతోంది. ప్రతి సీటు వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. వాహనదారులు కార్యాలయంలో పని కావాలంటే ఆ ఉద్యోగి వ్యవహారాలు చక్కపెడుతున్న ప్రైవేటు వ్యక్తిని క లిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప కరుణాకటాక్షాలు వాహనదారులకు లభించని పరిస్థితి నెలకొంది. ఆయా సేవలకు సంబంధించి ధరలు నిర్ణయించి వసూలు చేసే బాధ్యతను కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ అసిస్టెంట్లకు అప్పజెప్పారు. దీంతో కొంత మొత్తాన్నిముందుగానే ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తే తప్ప పనులు కావడంలేని వాహనదారులు వాపోతున్నారు. సెక్షన్లకు సంబంధించిన ఉద్యోగుల వద్ద తిష్ట వేసుకున్న అసిస్టెంట్లు రోజుకు రూ. లక్షకు పైగానే అనధికార మొత్తాన్ని వసూలు చేస్తున్నారని కార్యాలయ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు.
సోమవారం ఓ ఉద్యోగి అసిస్టెంట్ దర్జాగా సీట్లో కూర్చుని ఎంచక్కా కంప్యూటర్లో సేవలు అందించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు వస్తుంటారు. లెసైన్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహనబదిలీ, పన్నులు చెల్లింపు, పర్మిట్లు జారీ తదితర సేవలను రవాణా కార్యాలయంలో నిత్యం జరుగుతుంటాయి. కార్యాలయంలో ఉప రవాణా కమిషన్‌తో పాటు ఆర్టీఓ, మోటారు వాహనాల అధికారులు ఉంటారు. వారితో పాటు కార్యాలయంలో వాహనదారులకు సేవలు అందించేందుకు వివిధ సెక్షన్లలో ఉద్యోగులు ఉంటారు.
మ్యాక్సీక్యాబ్‌లు, టెంపోలు, టూరిస్టు పర్మిట్లు, బస్సుల సీసీల తదితర పనులు చక్కబెట్టేందుకు ఓ ఉద్యోగిని నియమించారు. ఈ ఉద్యోగి తన వ్యక్తి గత అసిస్టెంట్‌గా ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని అనధికారికంగా అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బైకులు, కార్లు, నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్, సెకండ్ హ్యాండ్ వాహనాల బదిలీలను ఓ ఉద్యోగి చూస్తుంటారు. ఆయన ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని ఆ సెక్షన్‌కు సంబంధించి పనులతో పాటు అనధికార మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్నారు.
కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్లు, అధికలోడు వాహనాల రిలీజ్ ఆర్డర్లు, బదిలీలు తదితర పనులు చూస్తుం టారు. ఈయన కూడా ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అకౌంట్స్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి కూడా ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఆయన రవాణ శాఖ ఉన్నతాధికారితో సత్సంబంధాలు పెట్టుకుని అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి రోజుకు పనులు బట్టి రూ.8 వేల నుంచి 12 వేల దాక వస్తాయని వారి అసిస్టెంట్లు చెబుతుండటం గమనార్హం. కాని తమకు మాత్రం రూ. 500 నుంచి వెయ్యి రూపాయిలు మాత్రమే ఇస్తారని చెబుతున్నారు.
అసిస్టెంట్లదే హవా..
కార్యాలయంలోకి అసిస్టెంట్లు వచ్చి ఉద్యోగుల సీట్లలో కూర్చుని కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారని తెలిసినా సంబంధిత ఉన్నతాధికారులు మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కార్యాలయ పనివేళల్లోనే దర్జాగా వచ్చి ఉద్యోగులు సీట్లలో కూర్చుంటున్నారు. ఉపరవాణా కమిషనర్ రాష్ట్ర విభజన కమిటీలో సభ్యులుగా ఉండటం, ఆర్టీఓకు గూడూరు బాధ్యతలు అప్పజెప్పడంతో వీరు కార్యాలయంలో అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంటూ తమ హవా కొనసాగిస్తున్నారు.
లావాదేవీలన్నీ సాయంత్రమే ...
కార్యాలయంలోకి ఏజెంట్లు నిషేధం ఉన్నా అన్ని వ్యవహారాలు వారి ద్వారానే జరుగుతుంటాయి. వాహనాదారుల దరఖాస్తులు వచ్చినప్పుడు వారి చేతిరాత ఆధారంగా ఏజెంట్‌ను గుర్తించి సంబంధిత పత్రాలను అసిస్టెంట్లు అందజేస్తారు. చలానాలకు సంబంధించి అప్పుడే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి సాయంత్రం మాత్రం ఆపనికి సంబంధించి నిర్ణయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగుల అసిస్టెంట్లకు ఇస్తారు.