కంపెనీలకు ఇంధన పొదుపు అవార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధన పొదుపుపై ప్రధానంగా దృష్టిసారిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహక విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే కనీసం ఒక శాతం ఇంధన పొదుపు చేసిన పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు, అవార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఫిక్కి ‘ టెక్నికల్ మీట్ ఆన్ ఇండస్ట్రియల్ వేస్ట్ హీట్ రికవరీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో చంద్ర శేఖర రెడ్డి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పరిశ్రమలు ఇంధన పొదుపును అమలు చేసే విధంగా గ్రీన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కోడ్‌ను ప్రవేశపెట్టన్నుట్లు తెలిపారు. నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి చోటు లభించడంపై పారిశ్రామిక రంగం సంతోషం వ్యక్తం చేసిందన్నారు.
కనీసం 25 నుంచి 30 శాతం ఇంధన పొదుపు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల కార్యక్రమాన్ని చేపడుతోందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని చంద్ర శేఖర్ తెలిపారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చ డం, ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వ్యవసాయ పంపుసెట్ల బదులుగా ఇంధనం ఆదా చేసేవి..సౌర పంపు సెట్లను అమర్చడం ఈ ఐదు సూత్రాల్లో ఉన్నాయి. వీధి దీపాల కోసం ఎల్ఈడీలను వాడటం, పరిశ్రమల్లో గ్రీన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కోడ్‌ను అమల్లోకి తేవడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలపై అవగాహన పెంచేందుకు సమర్ధమంతమైన వ్యూహాలను అమలు చేసే అంశాన్ని కూడా ఈ సూత్రాల్లో పొందుపర్చినట్లు చంద్రశేఖర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల సహాయంతో ఈ అయిదు సూత్రాల పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని చంద్రశేఖర్ చెప్పారు. విద్యుత్ ఆదా చేసే వీధి దీపాల ఏర్పాటు ప్రాజెక్టును ముందు గా హిందూపురం, విజయనగరం, విశాఖపట్నం మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ థర్మల్ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు వారి పరిజ్ఞానాన్ని, అనుభవాల్ని సదస్సులో పంచుకున్నారు.