మొదటి ఫ్రీ వైఫై పంచాయతీ..!
ఇండియాను డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న మోడీ ఆశయాన్ని ముందుగానే ఆ పంచాయతీ అందిపుచ్చుకుంది. తనకు తానుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గ్రామ పంచాయతీ మొదటి ఫ్రీ వైఫై ప్రవేశ పెట్టి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒక్క ఫ్రీ వైఫై తోనే కాదు... ఇంతకు ముందే ఎన్నో కార్యక్రమాలతో పలు రకాల అవార్డులు తెచ్చుకోవడంలో కేరళ రాష్ట్రంలోనే ఎరవిపెరూర్ పంచాయితీ ముందుంది.
ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు ప్రత్యేక సేవలు అందించడంలో ఎరవిపెరూర్ గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేక గ్రామంగా పేరు తెచ్చుకుంది. కేరళ పతనంతిట్ట జిల్లాలోని ఎరవి పెరూర్ పంచాయితీలో ఫ్రీ వైఫై సేవలను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనే మొదటి వైఫై గ్రామంగా ఎరవి పెరూర్ గుర్తింపు తెచ్చుకుంది. పంచాయతీప్రెసిడెంట్ ఎన్. రాజీవ్ ఆధ్వర్యంలో గ్రామం.. అభివృద్ధి పథంలో దూసుకుపోతూ దేశంలోని ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
వైఫై హాట్ స్పాట్, ఫ్రీ వైఫై కనెక్షన్లను పంచాయతీలోని కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో ప్రవేశ పెట్టి ప్రజలకు ప్రత్యేక సేవలందిస్తోంది. పంచాయతీకి ఒక కిలోమీటర్ దూరం వరకూ ఈ వైఫై పనిచేస్తుంది. అలాగే పంచాయతీలోని రూరల్ ప్రాంతాలైన వల్లచకులమ్ గ్రామ విజ్ఞాన కేంద్రం, కోజిమల పంచాయతీ ఆఫీస్, నన్నూర్ ఆయుర్వేద డిస్పెంన్సరీ, ఒథేరా ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎరవి పెరూర్ ఛిల్డ్రన్ పార్క ప్రాంతాల్లో కూడ ఫ్రీ వైఫై సేవలను అందిస్తోంది. మొత్తం నాలుగు లక్షల పదిహేడు వేల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా... యాక్టివ్ ఇన్ఫోకాం లిమిటెడ్ సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
ఎరవి పెరూర్ కు ప్రత్యేక గుర్తింపు రావడం ఇదే మొదటి సారి కాదు... ఇంతకు ముందు కూడ మరో ఆరు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన పంచాయితీ... కేరళ రాష్ట్రంలోనే ప్రత్యేక పంచాయతీల వరుసలో ముందుంది. దేశంలోనే మొదటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్ కూడ ఎరవి పెరూర్ గ్రామం అందుకుంది. మూడేళ్ళ క్రితం నుంచీ వరుసగా గ్రామానికి పలు అవార్డులు దక్కుతూనే ఉన్నాయి. స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా బయో డైవర్శిటీ కంజర్వేషన్ అవార్డ్, స్టేట్ శానిటేషన్ మిషన్ ద్వారా శానిటేషన్ అవార్డ్ లు ఎరవి పెరూర్ పంచాయితీకి లభించాయి. అలాగే పంచాయితీలో పేదలకోసం ప్రవేశ పెట్టిన ఫ్రీ పల్లియేటివ్ స్కీమ్ 2014-15 కు గాను రాష్ట్ర ప్రభుత్వ హెల్గ్ అవార్డు, పెయిన్ అండ్ పల్లివేట్ కేర్ అవార్డు పంచాయితీ దక్కించుకుంది.
మంచి ఆరోగ్యం కోసం అవుట్ పేషెంట్ లో కంప్యూటర్ల ఏర్పాటు, ఫార్మసీ మోడరనైజేషన్ వంటివి పంచాయతీ ప్రారంభించింది. దీంతో ఒథేరా ప్రైమరీ హెల్గ్ కేర్ సెంటర్... ఐఎస్ ఓ-9001 సర్టిఫికేషన్ తెచ్చుకున్న మొదటిదిగా రాష్ట్రంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది. ఇ-గవర్నెన్స్ ను ప్రవేశ పెట్టి... ప్రజలను ఎస్ ఎం ఎస్ ల ద్వారా అలర్ట్ చేయడం ప్రారంభించింది. అంతేకాక ఎరవి పెరూర్ గ్రామాలను హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ మోడల్ హై టెక్ గ్రీన్ విలేజెస్ గా కూడ ఇంతకు ముందే గుర్తించింది.