Exchange Traded Fund
-
ఇక చిన్న మదుపరికీ బాండ్లు!
న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్ బాండ్ మార్కెట్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్ మార్కెట్‌ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్ కేలండర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు. బాండ్ ఈటీఎఫ్ విశేషాలు.. ► భారత్– 22 ఈటీఎఫ్ మాదిరే ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ► ఒక్కో యూనిట్ విలువ రూ.1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ► క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది. ► గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఉండదు. ► రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50–1.40% అధికంగా ఉండొచ్చని అంచనా. ► బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది. ► ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఈ ఒక ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. ► ఈటీఎఫ్ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల కోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ కింద బాండ్లను జారీ చేయవచ్చు. ► ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలను ఎడెల్వీజ్ ఏఎంసీ చూస్తుంది. రిస్క్ చాలా తక్కువ... ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, ఎస్సెల్ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేసినా, లేక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇలాంటి పరిస్థితి ఉం డదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటివరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. – ఎన్ఎస్ వెంకటేశ్, సీఈవో, యాంఫి ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్ బాండ్ ఈటీఎఫ్ ఉంటుంది. – రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్వీజ్ ఏఎంసీ బాండ్ ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్‌తో కూడిన కార్పొరేట్ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం. – అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్, ఇక్రా -
సర్కారీ షేర్ల మేళా!
కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్–22’ ► ఆరు రంగాలకు చెందిన షేర్లతో కూర్పు ► ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర 22 షేర్లతో ఏర్పాటు న్యూఢిల్లీ: ‘భారత్–22’ పేరుతో కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రంగాల నుంచి ఎంపికచేసిన షేర్లు ఇందులో వుంటాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటుచేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించిన ప్రభుత్వం తాజాగా రెండో ఈటీఎఫ్‌కు శ్రీకారం చుట్టింది. ఇంధనం, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్–ఈ ఆరు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్–22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. తాజా ఈటీఎఫ్‌కు ఆయా రంగాలను ఎంపికచేసేటపుడు, ఆ రంగాల్లో జరిగిన సంస్కరణల్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆయా షేర్ల విలువలపై సంస్కరణల సానుకూల ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ బ్యాంకులు కూడా... భారత్–22 జాబితాలో పైన పేర్కొన్న ప్రైవేటు దిగ్గజాలే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు వున్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్–22లో చేర్చినట్లు జైట్లీ తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను అవసరమైన సమయంలో 52 శాతానికి తగ్గించుకుంటామని ఆయన చెప్పారు. కొత్త ఈటీఎఫ్‌లో ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్, కోల్, మైనింగ్ ప్రభుత్వ కంపెనీలైన ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కోలు వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీలు కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొద్దికొద్దిగా ప్రభుత్వ వాటాను ఈటీఎఫ్‌లోకి మళ్లిస్తామని ఆయన వివరించారు. తొలి ఫండ్ ద్వారా ఈటీఎఫ్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా అమలుచేసిందని జైట్లీ చెపుతూ ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల కింద 4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయన్నారు. పలు పెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ ఫండ్స్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నందున, వచ్చే నాలుగేళ్లలో ఈ ఆస్తుల విలువ 7 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చన్నది అంచనా అని ఆయన వివరించారు. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి రిస్క్ తక్కువని ఆయన అన్నారు. మ్యూచువల్ ఫండ్ తరహాలోనే... మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే..ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదేతరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. తొలి ఈటీఎఫ్‌లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐఓసీ, గెయిల్, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్ఈసీ, ఇంజనీర్స్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్లు వున్నాయి. భారత్–22 యూనిట్లను ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు కేంద్ర పెట్టుబడుల శాఖ కార్యదర్శి నీరజ్ గుప్తా వెల్లడించారు. దీని ద్వారా సేకరించబోయే నిధులకు పరిమితి ఏదీ విధించుకోలేదన్నారు. -
అక్టోబర్ కల్లా మలి విడత సీపీఎస్ఈ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో రూపొందించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్ఈ-ఈటీఎఫ్)ను అక్టోబర్ నాటికి మరో దఫా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు పుష్కలంగా నిధులు ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు కల్పించనుంది. దీపావళి లోగా ఈ న్యూ ఫండ్ ఆఫర్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఇందులో స్టాక్స్ యథాతథంగానే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2014లో ప్రభుత్వం తొలిసారిగా 10 పీఎస్‌యూల స్టాక్స్‌తో సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టినప్పుడు రూ. 3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ. 10 ముఖవిలువ ఉండే ఈటీఎఫ్ యూనిట్లలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ. 5,000- గరిష్టంగా రూ. 10 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. -
ఈటీఎఫ్‌కు స్పందన బావుంది
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు(సీపీఎస్ఈ ఈటీఎఫ్) పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫండ్ కింద రూ.3,000 కోట్లకుగాను బుధవారం నాటికే రూ.1,800 కోట్లు సమీకరించడమే ఇందుకు నిదర్శనమని గోల్డ్‌మన్ శాక్స్ అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) ఈడీ విజేష్ పేర్కొన్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన రూ.900 కోట్లలో రూ.850 కోట్లు ఇప్పటికే వచ్చాయని చెప్పారు. 2013-14లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.30 వేల కోట్లు సేకరించాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సంస్థలు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లకపోవడంతో లక్ష్యాన్ని రూ.16 వేల కోట్లకు కుదించారని కేంద్ర ఆర్థిక శాఖలోని పెట్టుబడుల ఉపసంహరణ విభాగం సంయుక్త కార్యదర్శి సంగీత చౌరె తెలిపారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్ కింద సమీకరించే రూ.3 వేల కోట్లు జతకూడితే లక్ష్యం పూర్తి అవుతుందని అన్నారు. సీపీఎస్ఈ ఇండెక్స్‌లో ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, ఐవోసీఎల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీఈఎల్, ఇంజనీర్స్ ఇండియాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ స్కీం నేటితో(మార్చి 21) ముగుస్తుంది. ఆఫర్ నేడు ముగింపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఆఫర్ శుక్రవారం(21న) ముగియనుంది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేయగా, గురువారం సాయంత్రానికి రూ. 2,400 కోట్లమేర బిడ్స్ దాఖలయ్యాయి.