పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య
కానూరు(పెనమలూరు) : పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య అని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 12వ వర్ధంతి సందర్బంగా కానూరులో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పల్లంరాజు మాట్లాడుతూ దేశంలో పరిపాలనాపరంగా అనేక మార్పులు తీసుకువచ్చింది పీవీయేనని అన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని తెలిపారు. బీజేపీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా పేదలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. చాలా మంది బ్యాంకుల వద్దే ప్రాణాలు వదిలారని, దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో పేదలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెలగపూడికి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొవ్వా మోహనరావు, వింతా సంజీవరెడ్డి, ఎన్.మాధవి, ఎస్వి.రాజు, వెలిశిల సుబ్రహ్మణ్యం, కిలారు వెంకటరత్నం, జవహర్లాల్ నెహ్రూ, చిర్రావూరు రవి, నాగదాసు ప్రవీణ్, నెర్సు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.