కంట్లో 27 కాంటాక్ట్ లెన్సులు
వైద్యులే ఆశ్చర్యపోయిన ఓ ఘటన లండన్‌లో వెలుగుచూసింది. కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ లెన్సుల గురించి మనకు తెలిసిందే. అయితే ఎవరి కళ్లల్లోనైనా ఒకటి మించి కాంటాక్స్ లెన్స్ ఉండవు. కానీ ఓ మహిళ కంట్లో నుంచి ఏకంగా 27 కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశారు వైద్యులు. లండన్‌లో 67 ఏళ్ల ఓ మహిళకు కంటి శుక్లాల శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. కంటి లోపల నీలిరంగులో పొరలు ఉండటాన్ని గమనించి, వాటిని పరీక్షించి చూసి నివ్వెరపోయారు. కంట్లో కాంటాక్ట్ లెన్స్‌లను తీయకుండా సదరు మహిళ అలాగే ఉంచేసుకుందని గుర్తించారు. తొలుత రెండో మూడో కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నట్లు భావించిన వైద్యులు ఆ తర్వాత తీసేకొద్దీ వస్తుండడంతో అవాక్కయ్యారు. మొత్తం అలా చిక్కుకున్న 27 లెన్స్‌లను బయటకు తీశారు.
కాంటాక్ట్ లెన్స్‌లు వాడిన అనంతరం తొలగించకపోవడంతో ఇవన్నీ కంటిలో చిక్కుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ‘ఇలాంటి ఘటనను మేం ఇంత వరకూ చూడలేదు. భారీ మొత్తంలో కాంటాక్ట్‌లెన్స్‌లు ఆమె కంటిలో చిక్కుకుపోయాయి. 17 లెన్స్‌లు కలిసి ముద్దగా మారాయి. అయితే బాధితురాలు ఈ విషయాన్ని గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ కారణంగానే ఆమె కంటి సమస్య మరింత ముదిరింది. మొదట మేం 17 లెన్స్‌లను మాత్రమే గుర్తించాం. ఆ తర్వాత మరిన్ని పరీక్షలు నిర్వహించగా మరో పది ఉన్నట్లు తేలింది’ అని ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లో ఒకరైన రూపల్ మోర్జారియా తెలిపారు. వైద్యులను సంప్రదించకుండానే డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని రూపల్ స్పష్టం చేశారు.