గ్యాంగ్‌స్టర్ అయూబ్ పై 72 కేసులు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్‌ను పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా ముంబైలో తలదాచుకుంటున్న అతడిని, హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బలవంతపు వసూళ్లు, పలు హత్యల్లో అయుబ్పై కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అయూబ్‌పై 22 భూ ఆక్రమణ, ఎనిమిది హత్యలతో పాటు మొత్తం 72 కేసుల్లో నిందితుడని తెలిపారు.
ముంబైలో నిన్న అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అతడిని పురానా హవేలీలోని తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అతడిపై పలు హత్యాయత్నం కేసులతో పాటు, బెదిరించి డబ్బులు గుంజుకోవడం వంటి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నకిలీ పాస్‌పోర్టు ఆధారంగా ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అయూబ్‌ను గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారన్నారు. గతంలోనూ ఇతడిపై ఓ నకిలీ పాస్‌పోర్టు కేసు నమోదు అయినట్లు డీసీపీ చెప్పారు. అయుబ్ గ్యాంగ్‌లోని మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.